పూరి జగన్నాధ్ కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాకు మోక్షం మాత్రం కలగడం లేదు. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట మహేష్‌తో చేయాలని రాసుకున్న కథ.. అలాగే ఓ మూలన పడి ఉంది. పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత మహేష్‌తో మరో సినిమా చేయాలని పూరి ‘జనగణమన’ కథను రాసుకున్నాడు. టైటిల్‌ను కూడా రిజస్టర్ చేయించాడు.
అయితే మహేష్‌తో ఈ సినిమా తీయాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు జరిపినా వర్కవుట్ అవలేదు. దాంతో ప్రతీ ఏటా ఆ టైటిల్‌ను రిన్యువల్ చేస్తూ వస్తున్నాడు. ఇక అన్ని కుదిరి రౌడీ స్టార్ విజయ్‌తో ఈ సినిమాను పట్టాలెక్కించాడు. లైగర్ చేస్తున్న టైమ్‌లోనే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూట్ కూడా చేశాడు. యుద్ద విమానాలు, సైనికులు, మిస్సైల్స్, బులెట్లతో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ దేశభక్తిని చాటి చెప్పే సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వెల్లడించాడు.
షెడ్యూల్ ప్రకారం ఇదే నెల 3వ తేదిన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తీరా లైగర్ ఊహించని స్థాయిలో డిజాస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేశారు. ఇక ఆ తర్వాత విజయ్ ఖుషీలో బిజీ అవగా.. ఈ మధ్యనే పూరి డబుల్ ఇస్మార్ట్‌ను స్టార్ చేశాడు. కాగా తాజాగా ‘జనగణమన’ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట సందడి చేస్తుంది.
ఈ సినిమా అందరూ అనుకున్నట్లు క్యాన్సిల్ అవ్వలేదట. లేట్‌గా మొదలవ్వచ్చేమో గానీ పక్కాగా సినిమా ఉంటుందని టాక్. అయితే విజయ్ ప్లేస్‌లో మరో హీరో ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.