‘మిస్‌ అండ్‌ మిస్టర్‌ పోలిశెట్టి’ విడుదల తేదీతో మొదలైన ప్రమోషన్స్‌!

యువి క్రియేషన్స్‌ బ్యానర్‌లో నవీన్‌ పొలిశెట్టి, అనుష్క లీడ్‌ రోల్‌ లో వస్తున్న సినిమా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సెప్టెంబర్‌ 7న విడుదలకు సిద్దం కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టారు. చిన్న సినిమాలతో మొదలు పెట్టిన యువి క్రియేషన్స్‌ ప్రభాస్‌ తో భారీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రభాస్‌ తో చేసిన సినిమాలు బిజినెస్‌ బాగానే చేస్తున్నా ఫలితాలు తేడా కొట్టడం వల్ల ఆ నిర్మాణ సంస్థ ఫాం కొనసాగించలేకపోయింది.

యువి క్రియేషన్స్‌ భారీ బ్జడెట్‌ తో తీసిన ‘రాధే శ్యాం’ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఆ సినిమా తర్వాత యువి క్రియేషన్స్‌ ఇక సినిమాలు చేయడం కష్టమే అని అనుకున్నారు. కానీ అనుష్కతో మరో సినిమా చేశారు. ‘జాతిరత్నాలు’ తో సూపర్‌ హిట్‌ అందుకున్న నవీన్‌ పొలిశెట్టి హీరోగా అనుష్క హీరోయిన్‌ గా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా మీదే యువి క్రియేషన్స్‌ భారీ హోప్‌ పెట్టుకుంది. అనుష్క సినిమాతో ఎలాగైనా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.

నవీన్‌ పొలిశెట్టి, అనుష్క ఇద్దరు కలిసి చేసిన ఈ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమా ఆడియన్స్‌ ని సూపర్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుందని అంటున్నారు. అనుష్కని వెండితెర మీద చూడాలని ఆమె ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న అనుష్క కమర్షియల్‌ సినిమాలకు నో చెబుతున్నా ఫిమేల్‌ సెంట్రిక్‌ సినిమాలకు మాత్రం ఓకే అనేస్తుంది. నవీన్‌ తో చేసిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమా హిట్‌ అయితే మాత్రం అనుష్కకి మళ్లీ మంచి బూస్టింగ్‌ ఇచ్చినట్టే లెక్క!!