ఏ భాషలో నటించినా తన నేటివిటీ ఉన్నట్లుగా నటించే నటీమణుల్లో ప్రియమణి ఒకరు. ఎందరో పరభాషా నటీమణులు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చారు, కానీ అందులో తెలుగు కొందరు మాత్రమే నేర్చుకున్నారు. కానీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ ఇన్ని భాషలు అతి సునాయాసంగా మాట్లాడుతూ, అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న నటి మాత్రం ఎవరైనా ఉంటే అది కేవలం ప్రియమణి మాత్రమే. ఇటు తెలుగు సినిమాలే కాకుండా, అటు తమిళం, మలయాళం, హిందీ సినిమాలు కూడా అప్పుడప్పుడూ చేస్తూ తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటి ప్రియమణి.
ఈమధ్యనే ఓటిటి లో కూడా తన ప్రతాపం చూపిస్తూ, అక్కడ కూడా పెద్ద విజయం సాధించారు అనే చెప్పాలి. మనోజ్ బాజ్ పేయి తో ‘ఫ్యామిలీ మాన్’ సిరీస్ లో తనదైన నటన చూపించి అందరినీ అబ్బుర పరచిన నటి ప్రియమణి. అందుకే అదే సిరీస్ రెండో సీజన్ లో కూడా ప్రియమణి కి మంచి ప్రాధాన్యమైన పాత్ర ఇచ్చారు దర్శకుడు రాజ్ డీకేలు. తెలుగులో ఆహా ఓటిటి ఛానెల్ ‘భామా కలాపం’ అనే సినిమాని ప్రియమణి ప్రధాన పాత్రలో తీశారు. అది విజయవంతం అయింది. దానికి సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ అనే ఇంకో సినిమా కూడా ఈమధ్యనే విడుదల చేశారు. ఇది కూడా విజయవంతం అయింది. ఈ రెండు సినిమాలు కేవలం ప్రియమణి తన ప్రతిభతో విజయవంతం అయేట్టు చేయగలిగారు.
గత నెలలో విడుదలైన ‘ఆర్టికల్ 370’ అనే సినిమాలో కూడా నటించి మెప్పించింది. అందులో ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే జాయింట్ సెక్రెటరీగా ప్రియమణి నటించింది. ఈ సినిమా థియేటర్స్ లో కూడా విడుదలైంది, మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇది రాజకీయ నేపథ్యంలో తీసిన సినిమా. ఇప్పుడు ‘మైదాన్’ అనే హిందీ సినిమాలో కూడా చేస్తున్న ప్రియమణి, ఒక తమిళ సినిమా, కన్నడ సినిమా కూడా చేస్తోంది. ప్రముఖ నటి విద్యా బాలన్ కి ప్రియమణి కజిన్ అవుతుంది. అలాగే ప్రియమణి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలు చాలా చక్కగా మాట్లాడే నటి. ఇన్ని భాషలు మాట్లాడే నటులు చాలా అరుదుగా వుంటారు. అలాగే జాతీయ ఉత్తమ నటితో పాటు, తన నటనకి ఎన్నో అవార్డులు గెలుచుకున్న నటి ప్రియమణి.