Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా సినీ పరిశ్రమ సమస్యలపై కూడా ఆయన స్పందిస్తూ తన వంతు సహాయాన్ని సలహాలను అందిస్తుంటారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా చలన చిత్ర పరిశ్రమలో టికెట్ల రేట్లు దారుణంగా పడిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమ కోసం ఏపీ ముఖ్యమంత్రితో పలుమార్లు సమావేశమై ఈ విషయం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పలుమార్లు కలిసిన తర్వాత సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ జీవో విడుదల చేశారు.
ఇక ఈ జీవో విడుదల విషయంపై మెగాస్టార్ చిరంజీవి తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచడంతో త్వరలోనే విడుదల కాబోతున్న సినిమాలకు కాస్త ఊపిరి పోసినట్లయింది. ఇదిలా ఉండగా నేడు మహిళా దినోత్సవం కావడంతో మెగాస్టార్ చిరంజీవి దంపతులు నగరంలోని బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో మహిళా దినోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి పలువురు సినీ పరిశ్రమకు చెందిన మహిళలకు సన్మాన కార్యక్రమాలు చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మహిళల గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడారు. ఈ సమావేశంలో భాగంగా రిపోర్టర్స్ టికెట్లను పెంచుతూ విడుదల చేసిన జీవో పై ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి సమాధానం చెబుతూ ప్రస్తుతం నేను ఈ జీవో గురించి ఏం మాట్లాడినా అది వివాదమే అవుతుంది కనుక దాని గురించి ఇక్కడ ఏమీ మాట్లాడని ఒకవేళ అవసరం అయితే ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం విడుదల చేసిన జీవో గురించి మాట్లాడతానని ఆ ప్రశ్నలు దాటవేశారు. అయితే ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యల పై స్పందించి టికెట్ల రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు.