శ్రీలీలను వెంకీ కుడుముల పక్కన పెట్టారా?

తెలుగు నటి శ్రీలీల గత సంవత్సరం అంతా తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉండేది. ఆమె తేదీలు దొరకటమే కష్టంగా వుంది అని పరిశ్రమలో ఒక టాక్‌ కూడా నడిచింది. నటుడు నితిన్‌ అయితే ఆమె ఎప్పుడు షూటింగ్‌ వస్తుంది, ఎన్ని గంటలు షూటింగ్‌ చేస్తుంది, ఆ కేటాయించిన గంటల్లో ఆమెతో ఎటువంటి సన్నివేశాలు చెయ్యాలి అనేదే మాకు పెద్ద ఛాలెంజ్‌ అని తన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ చిత్ర ప్రచార సభల్లో చెప్పారు కూడా. మరి అంత బిజీగా వున్న శ్రీలీలని దర్శకుడు వెంకీ కుడుములతో చెయ్యబోయే తదుపరి సినిమాలో కూడా ఎందుకు తీసుకున్నారు అంటే దర్శకుడు వెంకీ ఆమే కావాలి అన్నారని, చెప్పారు నితిన్‌.

గత సంవత్సరం శ్రీలీల చేసిన సినిమాలు వరసగా ‘స్కంద’, ‘భగవంత్‌ కేసరి’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ అలాగే ఈ సినిమాలకి కొనసాగింపుగా ఈ సంవత్సరం సంక్రాంతికి ‘గుంటూరు కారం’ విడుదలైంది. రెండు రోజుల క్రితం నితిన్‌, వెంకీ కుడుములు సినిమా ‘రాబిన్‌ హుడ్‌’ సినిమా షూటింగ్‌ గురించి తాజా సమాచారం ఇస్తూ ఒక అధికారిక ప్రకటన వచ్చింది.

ఏమైందో ఏమో కానీ అందులో శ్రీలీల పేరు లేకపోవటం ఆసక్తికరం. ఈ సినిమాలో మొదట రష్మిక మందన్న కథానాయిక అనుకున్నారు, కానీ ఆమె అప్పట్లో హిందీ సినిమాతో బిజీగా ఉండటం వలన ఆమెకి బదులు శ్రీలీలని తీసుకున్నారు. కానీ ఇప్పుడు పంపిన అధికారిక ప్రకటనలో తారాగణం అంటూ నితిన్‌, వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ పేర్లు చెప్పారు కానీ శ్రీలీల పేరు అందులో లేదు.

అంటే శ్రీలీల ఈ మూవీ నుండి తప్పుకున్నారా, లేక నితిన్‌ అప్పుడు అన్న మాటలకి దర్శకుడు వేరే కథానాయికని పెట్టుకోవాలని అనుకున్నారా అనే విషయం విూద పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా నితిన్‌ కి మంచి విజయాన్ని ‘భీష్మ’ సినిమాతో అందించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న’రాబిన్‌హుడ్‌’ చిత్రంలో పూర్తిగా భిన్నమైన లుక్‌ లో నితిన్‌ అలరించనున్నారు అని ఆ అధికార ప్రకటనలో చెప్పారు.

ఈ సినిమా కు మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు. ఇది ఒక వినోదాత్మక యాక్షన్‌ అడ్వెంచర్‌ అని ఇందులో నితిన్‌ దొంగగా నటిస్తున్నారని చెప్పారు. ఆ ప్రకటన ప్రకారం దర్శకుడు ఇప్పుడు ఇంటర్వెల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ ప్రారంభించారు అని తెలిసింది. రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్స్‌ ఈ యూనిక్‌ యాక్షన్‌ బ్లాక్‌ని ఇంట్రస్టింగ్‌గా డిజైన్‌ చేస్తున్నట్టుగా తెలిసింది.