టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. లాక్ డౌన్ సమయంలో దిల్ రాజ్ పెళ్లి పీటలు ఎక్కగా, ఆ తర్వాత నిఖిల్, రానా, నితిన్, కాజల్ అగర్వాల్ తో పాటు పలువురు దర్శక నిర్మాతలు మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఆగస్ట్ 13న గుంటూరుకి చెందిన పోలీస్ ఆఫీసర్ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిశ్చితార్ధం జరుపుకుంది. వీరి పెళ్ళి ఎప్పుడా ఎన్నడా అంటూ మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో క్లారిటీ రానే వచ్చేసింది.
నిహారిక, చైతన్యలకు సంబంధించిన పెళ్లి డేట్ ఖరారైంది. వీరి పెళ్లి డిసెంబర్ 9వ తేదిన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఖరారైనట్టు వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జే. ప్రభాకర రావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ప్రభాకర్ రావు ఈ విషయాన్ని తెలిపారు. వివాహ పత్రికను స్వామి వారి దగ్గర ఉంచి పూజలు నిర్వహించారట. వేద పండితులు ప్రభాకర్ రావు దంపతులకి వేద ఆశీర్వచనాలు అందించారు. ఇక రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఉదయ్ విలాస్‌లో నిహారిక-చైతన్య వివాహం జరగనున్నట్టు ఆయన పేర్కొన్నారు
నిహారిక పెళ్లి ఏర్పాట్లన్నింటిని వరుణ్ తేజ్ స్వయంగా చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. నాగబాబు కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తన చెల్లి పెళ్ళి వేడుకను ఘనంగా జరిపేంచేందుకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడని పేర్కొన్నారు. ఇప్పటికే పెళ్లి పనుల్లో అత్యంత ముఖ్యమైన పసుపు దంచే కార్యక్రమం పూర్తి కాగా, మిగతా పనులు కూడా ఊపందుకున్నట్టు తెలుస్తుంది . కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే నిహారిక పెళ్లి వేడుకకి హాజరు కానున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చైతన్య .. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ఈయన చదువు పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో లెక్కల్లో మాస్టర్ డిగ్రీ చేసాడు. ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నాడు