సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ కొందరు సెలబ్రిటీలపై మాటల దాడి చేస్తున్నారు. ఆ మధ్య ధోని కూతురిని రేప్ చేస్తానని ఓ టీనేజర్ సోషల్ మీడియాలో కామెంట్ చేయగా, కొద్ది గంటలలోనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు కూడా కాలేదు, తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కూతురిపై అత్యాచారం చేస్తానంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో హెచ్చరించాడు. దీనిపై పలువురు ప్రముఖులు, నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తమిళంలో 800 మూవీ రూపొందుతుండగా, ఇందులో ప్రధాన పాత్ర పోషించేందుకు విజయ్ సేతుపతి సిద్దమయ్యారు. ఈ విషయంలోనే హీరో విజయ్ సేతుపతికి బెదిరింపులు వచ్చాయి. నీ కుమార్తెపై అఘాయిత్యం చేస్తే, ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నీకు అర్ధమవుతుంది అని ట్విట్టర్‌లో ఓ నెటిజన్ బెదిరించాడు. అయితే ఆ వ్యక్తిని రితిక్ రాజ్‌గా గుర్తించారు. సెలబ్రిటీ పట్ల ఆన్‌లైన్‌లో అనుచిత కామెంట్లు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సిటీ పోలీసు కమిషనర్ మహేశ్ కుమార్ తెలిపారు.
విజయ్ సేతుపతిని బెదిరించిన వ్యక్తి తన తప్పు తెలుసుకొని వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు. సర్ మీ కూతురి గురించి చెత్త కామెంట్స్ చేసింది నేను. నా కామెంట్స్ పై పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నా. గతంలో ఎవరితో ఇలా మాట్లాడలేదు. నేను చేసింది చిన్న తప్పుకాదు. కరోనా వలన నా జాబ్ పోయింది. అదే టైంలో 800 బయోపిక్ వివాదం మొదలు కావడంతో ఫ్రస్ట్రేషన్‌లో అలాంటి కామెంట్ పెట్టాను . జీవితంలో ఇలాంటి తప్పు మరలా చేయను. మీ కుటుంబ సభ్యులందరికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇదొక్క సారి నన్ను క్షమించండి. వీడియోలో నా ఫేస్ బ్లర్ ఉంది. నన్ను చూసి కాకపోయిన నా ఫ్యామిలీని చూసి అయిన క్షమించండి అని తెలిపాడు.