Natural Star Nani: బాక్సాఫీస్: నాని ప్రతీ సినిమాకు ఇదే సమస్య..

టాలీవుడ్‌లో మిడిల్ రేంజ్ హీరోల్లో బాక్సాఫీస్‌ దగ్గర ఓ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్న పేరు నేచురల్ స్టార్ నానిది. అతడి సినిమాలకు మొదటి రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద జోష్ చూపించడం సాధారణమే అయింది. కథ ఎలా ఉన్నా, ట్రీట్మెంట్ ఎలా ఉన్నా.. నానిపై ఉన్న నమ్మకంతో ఆడియన్స్ ఫస్ట్ డే థియేటర్లకు రావడాన్ని వీక్షించవచ్చు. కానీ ఈ ఫాస్ట్ స్టార్ట్‌కి ఓ స్టడీ ఎండ్ ఇవ్వడంలో నాని టీమ్‌కి ఎప్పటికప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి.

‘దసరా’ వంటి మాస్ డ్రామా నుంచి ‘హాయ్ నాన్న’ లాంటి ఎమోషనల్ క్లాస్ మూవీ వరకు.. రీసెంట్‌గా వచ్చిన ‘సరిపోదా శనివారం’, ‘హిట్-3’ వరకూ అన్నింటికీ ఒకే ఫలితం.. పాజిటివ్ టాక్. కానీ టాక్ కంటే ఎక్కువగా కలెక్షన్లు నిలబెట్టుకోవడంలో అసమర్థత మాత్రం కనిపిస్తోంది. ప్రారంభంలో కలెక్షన్ల హవా.. రెండో వారానికి వచ్చేసరికి వెనకడుగు వేస్తోంది. నైజాం, ఉత్తరాంధ్ర వంటి మార్కెట్లలో బ్రేక్ ఈవెన్ దాటినా.. మిగతా ఏరియాల్లో లాభాల మాటే మరిచిపోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. చివరికి, లాభం లేదు కానీ నష్టమూ తక్కువే అన్న దానికే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.

ఇప్పుడు నానీపై ఉన్న మైనస్ అదే.. ఓపెనింగ్స్ హాట్.. కానీ రన్ డల్. ఈ గ్యాప్‌ను భర్తీ చేయాల్సిన అవసరం ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ కనిపిస్తోంది. కథల ఎంపిక బాగానే ఉందని చెప్పుకుంటున్నా.. బలమైన మౌత్ టాక్‌ను బాక్సాఫీస్‌కు పూర్తిగా ట్రాన్స్‌ఫర్ చేయలేకపోవడం నానీ సినిమాల వెనకడుగు. ‘ది ప్యారడైజ్’తో మరోసారి హై బజ్ సెట్ అయ్యింది. ఈసారి మళ్లీ స్టార్ట్ బాగుండచ్చు. కానీ ఫినిష్ క్లియర్ హిట్‌గా నిలిచేలా మార్గం వేయగలిగితేనే, నాని తన క్రాఫ్ట్‌కు న్యాయం చేసుకున్నట్టవుతుంది.