హీరో నాని వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు శౌర్యువ్‌తో చేస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ లో విడుదలకు సిద్ధమౌతుంది. ఈ సినిమా తర్వాత మరో సినిమా కూడా రెడీగా పెట్టారు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నారు నాని. వీరిద్దరూ కలసి ‘అంటే సుందరానికీ’ చిత్రం చేసిన సంగతి తెలిసిందే.
దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో జతకడుతుంది. ఐతే ఈ సినిమా కోసం దర్శకుడు వివేక్ ఆత్రేయ రూటు మార్చుతున్నారు. వివేక్ సినిమాలు క్లాస్ వుంటాయి. క్లాస్ ఎలిమెంట్స్ తో కొత్త స్క్రీన్ ప్లే ట్రిక్స్ తో కథలు రాసుకోవడం వివేక్ స్టయిల్.
‘అంటే సుందరానికీ’ స్క్రీన్ ప్లే కూడా కాస్త తికమక పెట్టినప్పటికీ సినిమాని లోతుగా పరిశీలించి చూసిన వారికి భలే కొత్తగా చేశారనే అనుభూతిని ఇచ్చింది. ఐతే ఇప్పుడు నానితో చేయబోయే సినిమా మాత్రం వివేక్ స్టయిల్ కీ కొంచెం భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో యాక్షన్ శాతం ఎక్కువ ఉంటుదని, మాస్ ఆడియన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని కథని తయారుచేశారని సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డివీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.