సూపర్ స్టార్ మహేష్ బాబు మీసంకట్టులో చూడటం చాలా అరుదు. ఎప్పుడూ కూడా మహేష్ బాబు క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడు. మహేష్ బాబుకు మీసం ఉంటే నప్పదని అందరూ భావిస్తారు. అందుకే మహేష్ కూడా ఏనాడూ ఆ ప్రయోగానికి ముందడుగు వేయలేదు. అయితే ఈ మధ్య మహేష్ బాబు కాస్త సిగ్గు, బిడియాన్ని వదిలేస్తున్నట్టునన్నాడు. ఆ మధ్య మహర్షి సినిమా కోసం గడ్డాన్ని పెంచాడు. మొదటగా గుబురు గడ్డం కోసం ట్రై చేశాడు.
కానీ అది అంతగా సెట్ కాకపోవడంతో లైట్‌గా పెంచేశాడు. భరత్ అనే నేను చిత్రంలో ఓ సీన్‌లో మహేష్ బాబు పెట్టుడు మీసాలతో కనిపిస్తాడు. అందులో సూపర్ స్టార్ కృష్ణలా కనిపించాడని కామెంట్లు వినిపించాయి. తాజాగా మళ్లీ మహేష్ బాబు మీసం కట్టులో కనిపించాడు. కాకపోతే అది ఓ యాడ్ షూటింగ్ కోసం. ఫ్లిప్ కార్ట్ సేల్‌లో మహేష్ బాబు డబుల్ యాక్షన్ చేశాడు. అందులో ఓ పాత్రకు మహేష్ బాబు మీసంకట్టుతో కనిపించాడు.
పంచెకట్టు, మీసంకట్టులో మహేష్ బాబు లుక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ పాత్ర కోసం, లుక్ కోసం మహేష్ బాబు పడిన కష్టాలను తాజాగా నమ్రత షేర్ చేసింది. కొన్ని యాడ్స్ రియల్‌గా అనిపించవు.. మరీ ముఖ్యంగా ఈ మీసం కట్టు లుక్కులో. షూటింగ్ అంటే కచ్చితంగా కంఫర్టబుల్‌గా ఉండాలని లేదా సరదాగానే ఉండాలన్న నియమం ఏమీ లేదు.. అయితే మన వైపు నిష్ణాతులు ఉంటే ఎలాంటి చాలెంజింగ్ పనులైనా సరే ఇట్టే జరిగిపోతుంటాయని మేకప్ ఆర్టిస్ట్ పట్టాబి, డీఓపీ బోస్ గురించి చెప్పింది.