Naga Chaitanya: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నాగచైతన్య దంపతులు

ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కి బాత్‌లో భాగంగా.. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. మన్‌ కీ బాత్‌ 117వ ఎసిపోడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అక్కినేని తన కృషితో తెలుగు సినిమాను శిఖరాగ్రాన నిలబెట్టారని ఆయన కొనియాడారు. భారతీయ సంస్కృతి, వారసత్వ విలువలు ఆయన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని మోదీ మన్‌ కీ బాత్‌లో గుర్తుచేసుకున్నారు.

ఏన్‌ఆర్‌పై మోదీ మాట్లాడటంతో తెలుగువారంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలావుంటే.. మోదీచేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, శోభితా దుళిపాళ దంపతులు స్పందించారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతూ.. సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ నాగ చైతన్య, శోభిత రాసుకొచ్చారు.