సర్కార్ వారి పాట లో స్పెషల్ సాంగ్ .. క్లారిటీ ఇచ్చిన ‘బిగ్ బాస్’ బ్యూటీ మోనాల్ !

మోనాల్ గజ్జర్ .. ఈమె తెలుగు లో కొన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు , బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెచ్చుకుంది. హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. అలాగే నిత్యం ఏడుస్తూ బిగ్ బాస్ ఇంట్లో నర్మదా నది ని పారించింది. ఏదేమైనా కూడా పోటీలో చివరి వరకు నిలిచి చివరి వారం హౌస్ నుండి బయటకి వచ్చేసింది.

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక టాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. అటు ఆమె నటించిన హిందీ చిత్రం కాగజ్‌ ప్రశంసలు దక్కించుకుంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్‌ అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.తాజాగా మోనాల్‌కు మరో సూపర్ ఆఫర్ వచ్చిందంటూ ఓ వార్త షికార్లు చేసింది.

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమా `సర్కారు వారి పాట`లోనూ మోనాల్ ఓ ప్రత్యేక గీతం చేయబోతోందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే ఆ వార్త నిజం కాదని తాజాగా మోనాల్ కొట్టిపారేసింది. `సర్కారు వారి పాట` సినిమాకు సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని, ఆ సినిమాలో తాను ఎలాంటి ప్రత్యేక గీతమూ చేయడం లేదని తెలిపింది. మహేశ్‌బాబు, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.