మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ సోషియో-ఫాంటసీ సినిమా విశ్వంభర అభిమానులలో భారీ అంచనాలు కలిగిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తారీఖు మాత్రం ఎప్పటిలాగే మారుతూనే ఉంది. మొదట సంక్రాంతి 2025కి రెడీ అవుతుందనుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం సెప్టెంబర్ 25ను టార్గెట్ చేస్తూ మేకర్స్ కొత్త షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారట. దీనికొద్దిగా ఆలస్యం అయితేనేం.. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా క్వాలిటీ ఇవ్వాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
టీజర్ విడుదలైనప్పటి నుంచి వీఎఫ్‌ఎక్స్ పనిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, యూవీ క్రియేషన్స్ బృందం హాలీవుడ్ స్థాయి టెక్నికల్ టీమ్‌లను చేర్చుకుని దృశ్యాల పరంగా మెరుగుదలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్, హాంకాంగ్‌లలో భారీ వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. అందుకోసం రూ.75 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. పైగా కొన్ని కీలక సన్నివేశాలు మిగిలినవట, వాటి షూటింగ్‌కు తిరిగి సెట్స్ వేసే అవకాశం కూడా ఉందని టాక్.
ఇకపై పోస్ట్-ప్రొడక్షన్, మ్యూజిక్ రీ-రికార్డింగ్, ఓటీటీ డీల్స్ వంటి అంశాలన్నీ సెప్టెంబర్ 25 డేట్‌కు అనుగుణంగా కంప్లీట్ చేయాలన్నది మేకర్స్ సెట్ చేసుకున్న వ్యూహం. అయితే ఈ ఆలస్యం వల్ల అభిమానులు కొంత నిరాశ చెంది ఉన్నా, తుది ఉత్పత్తి పరంగా మెరుగైన సినిమాని అందించాలన్న మేకర్స్ నిర్ణయాన్ని పాజిటివ్‌గా చూస్తున్నారు. ‘రామ రామ’ పాట విడుదల తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ పెరగడం, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి సంగీతానికి మంచి స్పందన రావడం ఈ ఆలస్యాన్ని కొంత భర్తీ చేస్తుందని చెప్పాలి.