చిరంజీవికి అరబ్‌ ఎమిరేట్స్‌ గోల్డెన్‌ వీసా!

దేశంలో రెండు అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ను అందకున్న మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసాను ఆయన అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది.

తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్‌లో చిరు చేరారు. దీంతో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది.

ఇంతకుముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్‌, షారుక్‌ ఖాన్‌, అల్లు అర్జున్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, టొవినో థామస్‌ వంటి స్టార్‌లకు గోల్డెన్‌ వీసాలను ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది రూపొందుతోంది. రూ.200 కోట్లతో యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నారు. ఇందులో ఐదుగురు హీరోయిన్లు ఉన్నట్లు టాక్‌. ఇప్పటికే త్రిష, ఆషికా రంగనాథ్‌లను తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సురభి, ఇషాచావ్లా, విూనాక్షి చౌదరి కూడా ఉన్నట్లు టాక్‌. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.