ఆమె మాటలు నాకు వెయ్యేనుగుల బలం.. మహానటి సావిత్రిపై పుస్తకావిష్కరణలో చిరంజీవి

‘భవిష్యత్తులో మంచి నటుడివి అవుతావు’ అని మెచ్చుకున్న నటి సావిత్రి మాట నాకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మహానటి సావిత్రి సినీ ప్రస్థానంపై సంజయ్‌ కిషోర్‌ రచించిన పుస్తకం ‘సావిత్రి క్లాసిక్స్‌’ అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సావిత్రమ్మ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఆమెతో మంచి అనుబంధం ఉన్నందుకు గర్వపడుతున్నాను. ‘పునాదిరాళ్లు’లో నాకు అవకాశం కాకతాళీయంగా వచ్చింది. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు పూర్తి కాకుండానే నటించా. ఆ సినిమా కోసం రాజమండ్రి వెళ్తున్నప్పుడు.. నువ్వు సావిత్రమ్మ సినిమాలో నటిస్తున్నావని చెప్పడంతో సంతోషపడ్డాను. చిత్రీకరణకు ముందు ఆమెను చూశాను.

ఓసారి నేను డ్యాన్స్‌ చేస్తూ కిందపడ్డా. అయినా సరే ఆపలేదు. అది చూసిన ఆమె.. కొన్నేళ్ల తర్వాత ‘ప్రేమ తరంగాలు’ కోసం పనిచేశాం. ఆమె నాకు తల్లిగా నటించారు. ఆ తర్వాత ఆమెతో నటించే అవకాశం రాలేదు. కళ్లతోనే హావభావాలు పలికించే గొప్ప నటి. ప్రపంచంలో ఆమెలా మరెవ్వరూ చేయలేరు. మా నాన్న అభిమాన నటి. అనుక్షణం ఆమెను ఆరాధిస్తుంటా అని చిరంజీవి అన్నారు.

అనంతరం సావిత్రి కుమార్తె చాముండేశ్వరి మాట్లాడుతూ..’చిరంజీవి నాకు అన్నలాంటి వ్యక్తి. అమ్మకు ఒక పెద్ద కొడుకు ఉంటే ఏం చేస్తారో ఈరోజు ఆయన అదే చేశారు. పుస్తకావిష్కరణ నిమిత్తం కొన్ని రోజుల క్రితం ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశా. ఆయన ఇంట్లోనే పుస్తకం విడుదల చేద్దామని చెప్పా. కానీ, ఆయన మాత్రం ఫంక్షన్‌ చేయాలని ప్లాన్ చేశారు. ఇంతమంది సమక్షంలో దీనిని విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పారు. ఇదే కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. సురేఖ అడిగిన పలు ప్రశ్నలకు చాముండేశ్వరి సమాధానమిచ్చారు. అమ్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు, పుస్తకాలు వచ్చాయి.’మహానటి’ గొప్ప విజయాన్ని అందుకుంది. నేటితరం యువత కూడా అమ్మ గురించి గొప్పగా చెబుతున్నారంటే ఆ సినిమా వల్లే సాధ్యమైంది. అమ్మ బాల్యం, సినిమా కెరీర్‌, సేవలు, మరణం ఇలా అన్నీ చూపించారు. ఆమె ఫిల్మోగ్రఫీపై ఒక పుస్తకం ఉండాలని భావించా. అలా వచ్చిందే ఈ పుస్తకం. ఇందులో కేవలం ఆమె యాక్టింగ్‌కు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయని అన్నారు.