‘ఆర్.ఆర్.ఆర్’ కి షాకిచ్చిన మెగా పవర్ స్టార్ ..ఆచార్య కోసం తప్పలేదు..!

‘ఆర్.ఆర్.ఆర్’ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్స్ కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొనడం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో పాటు ‘ఆచార్య’ సినిమాలోను నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి – కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. మారేడు మిల్లి ఫారెస్ట్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ తాజా షెడ్యూల్ లో చరణ్ కూడా పాల్గొంటున్నాడు.

ఇక ఇప్పటికే మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాని మే 13న రిలీజ్ దేశ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దాంతో ముందు ఆచార్య సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చరణ్ డిసైడయినట్టు తెలుస్తోంది. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కి చరణ్ కాస్త గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ‘ఆర్.ఆర్.ఆర్’ రాజమౌళి ప్లాన్ చేసిన ప్రకారం మార్చ్ నెలలో కంప్లీట్ అవుతుందని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు చరణ్ ఆచార్య షూటింగ్ లో పాల్గొంటుండం వల్ల మరో నెల రోజులు ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ని పొడగించే అవకాశాలున్నాయని తాజా సమాచారం.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ .. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్, శ్రియ శరన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని విజయ దశమి పండుగ సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.