ఒకప్పుడు సినిమా షూటింగ్ అంటే 2-3 నెలల్లో పూర్తి చేసేదే. కానీ ఈ రోజుల్లో చిన్న సినిమాలకైనా ఏడాది పడుతోంది. స్టార్ హీరోల చిత్రాల సంగతేంటంటే… రెండేళ్లలో ఒక్క సినిమా వచ్చినా అదృష్టమే అనిపిస్తుంది. కానీ రవి తేజ మాత్రం ఈ టెండెన్సీకి బ్రేక్ వేయబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన చేయబోతున్న తాజా సినిమా నిర్మాణం అనూహ్యంగా వేగంగా జరుగబోతుంది. ఒక్క షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసి, ఏడాది లోపే థియేటర్లలోకి తీసుకురావాలన్నది మేకర్స్ లక్ష్యం.
ఈ సినిమా ఎలాంటి టైటిల్‌తో వస్తుందనేది ఇంకా అధికారికంగా తెలియకపోయినా, సంక్రాంతి రిలీజ్ అన్న హింట్‌తో పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 12న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వరకు టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారట. రవి తేజ సైడ్ నుంచి బల్క్ డేట్స్ సెట్ కాగా, దర్శకుడు కిషోర్ తిరుమల పూర్తి ప్రిపరేషన్‌తో రంగంలోకి దిగుతున్నాడు. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయడం ద్వారా బడ్జెట్ నియంత్రణతో పాటు టెక్నికల్ టీమ్‌ను ఒత్తిడికి గురి కాకుండా చేస్తారట.
‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి ఎమోషనల్ డ్రామాలకు పేరుగాంచిన కిషోర్ తిరుమల, రవి తేజ ఎనర్జీతో ఎలా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో అనే ఆసక్తిగా ఉంది. ముందుగా టాకీ పార్ట్ పూర్తయ్యాక పాటలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కాగా షెడ్యూల్ చేసి, డిసెంబర్ నాటికే ప్రమోషన్ మూడ్‌లోకి వెళ్లే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ‘దసరా’ వంటి భారీ హిట్ ఇచ్చిన సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండడం విశేషం. ప్లాన్ ప్రకారం ముందుకెళితే, ఇది టాలీవుడ్‌లో వేగవంతంగా పూర్తి అయిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతుంది.