మంచు లక్ష్మి.. ఈసారైనా హిట్టొచ్చేనా?

టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్గా గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మీ. తండ్రి మోహన్ బాబు నుంచి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. నటిగానే కాకుండా నిర్మాతగా వ్యాఖ్యాతగా కూడా కెరీర్​లో రాణిస్తోంది. అయితే ఈ జర్నీలో పలుసార్లు ట్రోల్స్​కు కూడా గురైంది. అయితే ఎవరేమనుకున్నా అనుకున్నది పక్కాగా చేసేసే లక్ష్మక్క.. ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి వెబ్​సిరీస్​పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. చివరిగా గతేడాది మలయాళంలో మోహన్ లాల్ మాన్​స్టర్​ మూవీలో లెస్బియన్ పాత్రలో కనిపించింది. అలా ఈ చిత్రంలో మరో నటితో లిప్ లాక్ చేసి విమర్శలకు గురైంది.

ఇక విషయానికొస్తే విలక్షణమైన నటిగా లక్ష్మీ పేరు తెచ్చుకున్నప్పటికీ ఆమెకు ఇప్పటి వరకు సరైన సక్సెస్​ దక్కలేదు. అయినా ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. తన తండ్రి బ్యానర్​ లక్ష్మీ ప్రోడక్షన్స్​లో సినిమాలు చేస్తోంది. హిట్ ఫ్లాప్​లతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. అయితే వీటిలో ఒక్క చిత్రం కూడా సరైనా బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకోలేదు. ఇంకా చెప్పాలంటే పెట్టుబడులు కూడా రాలేదని టాక్ నడిచింది.

అయితే ఆమె మళ్లీ ధైర్యం చేసి తాజాగా అదే బ్యానర్​లో తన తండ్రి మోహన్‌ బాబుతో కలిసి ‘అగ్ని నక్షత్రం’ అనే థ్రిల్లర్​ సినిమా చేసింది. దర్శకుడు ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కథ డైమండ్‌ రత్నబాబు అందించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్లు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తాజాగా గ్లింప్స్‌ వీడియోను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు.

ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్​ సన్నివేశాలతో సాగింది. ఇందులో లక్ష్మి పోలీస్​ ఆఫీసర్​గా కనిపించింది. ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వంత్‌, చిత్రా శుక్లా, సముద్రఖని, సిద్ధిఖ్‌లు నటిస్తున్నారు. లిజో కె జోస్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది అయినా హిట్​ అయి సినిమాలు లాభాలు తెస్తుందో లేదో.

YouTube video player