Mohan Babu:సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మరియు మా అధ్యక్షుడు మంచు విష్ణులు ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరుగుతున్న వివిధ పరిణామాల క్రమంలో వారికి ఏదో విధంగా షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇక అప్పటినుంచి వారి గురించి ఏ చిన్న వార్త వచ్చినా సంచలనంగా మారుతోంది. ఇంతకుముందు మా ఎలక్షన్ల గొడవ, ఆ తర్వాత సన్ ఆఫ్ ఇండియా సినిమాపై ట్రోల్స్ ఇలా ఏదో ఒక విషయంపై మంచు ఫ్యామిలీ ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కొంటూనే వస్తుంది.
ఇక ఇప్పుడేమో కొత్తగా మోహన్ బాబు, విష్ణుల దగ్గర దాదాపుగా 11 ఏళ్లుగా వారి వద్ద హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తిపై మంచు విష్ణు తన హెయిర్ స్టైల్‌కి సంబంధించిన సామాగ్రి దొంగతనం చేశాడంటూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శ్రీను అనే వ్యక్తి తాను ఏ తప్పూ చేయలేదని, వారి ఫ్యామిలీనే తనను కులం పేరుతో ధూషించారని, ఎదురుగా మాట్లాడి పని మానేస్తానని చెప్పినందుకే తనపై కేసు బనాయించారని ఒక వీడియోను విడుదల చేశారు.
ఇక శ్రీను అనే వ్యక్తిని కులం పేరుతో ధూషించి, అనరాని మాటలు అన్న మంచు ఫ్యామిలీపై ప్రస్తుతం నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోహన్‌బాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అతనికి అండగా నిలిచిన తెలంగాణ నాయిబ్రాహ్మణ సంఘం నేతలు తాజాగా మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి, వారిద్దరికీ వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా నాయిబ్రాహ్మణ కులాన్ని కించపరిచినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.