నేటి సమాజంలో నిత్యం ఎన్నో హత్యలు, అత్యాచారాలకు సంబంధించి వార్తలు వింటూనే ఉన్నాం. కఠిన శిక్షలు వేస్తున్నప్పటికి కొందరు రాక్షసుల్లా ప్రవర్తిస్తూనే ఉన్నారు. తాజాగా ముంబైలో ఓ నటిపై ఆమె బాయ్ ఫ్రెండ్ కత్తితో దాడి చేయడం సంచలనం రేపుతుంది. వివరాలలోకి వెళితే టీవీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మాల్వీ మల్హోత్రా ఓ ఏడాది నుండి కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తితో స్నేహం కొనసాగిస్తూ ఉంది. ఫేస్ బుక్ ద్వారా వీరిద్దరు స్నేహితులు కాగా, అతను తనని తాను నిర్మాత అని పరిచయం చేసుకొని చాలా క్లోజ్ అయ్యాడు.
కొన్నాళ్ళు మాల్వీ మల్హోత్రా ,కుమార్ మహిపాల్ సింగ్ ఇద్దరు మంచి అండర్‌స్టాండింగ్‌తోనే ఉండగా, రాను రాను ఆయన టార్చర్ ఎక్కువైంది. పెళ్ళి చేసుకుందాం అని డేటింగ్‌కు రావాలని మల్వీని వేధించడం మొదలు పెట్టాడట. దీంతో ఆమె అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఈ విషయంలో మనస్తాపానికి గురైన కుమార్ మహిపాల్ సింగ్ సోమవారం రాత్రి వెర్సోవాలో ఉన్న ఫిషరీస్ యూనివర్సిటీ రోడ్డులో ఆమెకు అడ్డుపడి కత్తితో దాడి చేశాడట. కత్తితో ఆమె కడుపులో చేతులపై దాడులు చేసి తను వచ్చిన ఆడి కారులో పరారయ్యాడట.
స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా, వారు వెంటనే మాల్వీని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడం వలన మాల్వీకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరగానే కోలుకుంటుందని తెలిపారు. అయితే మాల్వీపై దాడి చేసిన వ్యక్తి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. గత ఆదివారం దుబాయ్‌లో షూటింగ్ ముగించుకొని ముంబై వచ్చిన మాల్వీపై పక్కా ప్రణాళికతో దాడి చేసాడు సింగ్. ఉడాన్ టీవీ షో తో పాటు హోటల్ మిలాన్ సినిమాలో మాల్వీ నటించింది.