ఫేస్ బుక్ పరిచయం ప్రాణాల మీదకు వచ్చింది. ఆ మధ్య ఓ నటి తనపై దాడిచేశారని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తితో పరిచయం అవ్వడం, అతను పెళ్లి చేసుకోమ్మని బలవంత పెట్టడం, చివరకు ఒప్పుకోకపోవడంతో ఆ నటిని రోడ్డుపైనే కత్తితో పొడిచిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసింది. తాజాగా మళ్లీ ఆ నటి వార్తల్లో నిలిచింది. బుల్లితెర నటి మాల్వీ మల్హోత్రాపై అక్టోబరు 26న నిర్మాత యోగేశ్ మహిపాల్ సింగ్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
ముంబయి వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్ నుంచి మాల్వీ ఇంటికి వెళ్తుండగా తనతో వివాహానికి నిరాకరించిందని కత్తితో దాడికి పాల్పడ్డాడు. అలా గాయపడ్డ ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసి యోగేశ్‌ను అరెస్టు చేశారు. తాజాగా మాల్వీ మీడియాతో మాట్లాడుతూ.. నవంబరు 18న రాత్రి 9 గంటల ప్రాంతంలో నా తల్లిదండ్రులతో కలిసి మా ఇంటి ఆవరణలో వాకింగ్ చేస్తూ ఉన్నా. ఆ సమయంలో మాస్కు ధరించిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో నాపైకి దూసుకొచ్చాడని చెప్పుకొచ్చింది.
యోగేశ్‌కు త్వరలో బెయిల్ వస్తుంది. ఆ తర్వాత మీ కుటుంబం అంతు చూస్తాం అని మా నాన్నను చూసి గట్టిగా అరిచాడని చెప్పింది. అప్పటి నుంచి నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని.. మరో ఇంటికి షిఫ్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇంకా నా గాయాలు నయం కాలేదు. కేవలం వైద్య పరీక్షల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నా. సాయంత్రం కొంతసేపు నడవమని సూచించారు. కత్తి గాయాల వల్ల సరిగ్గా నడవలేకపోతున్నా. దాని కోసం వ్యాయామం చేయమన్నారని తన ఆరోగ్య పరిస్థితి గురించి మాల్వీ చెప్పుకొచ్చింది.