మహేష్.. ఈసారి సిక్స్ ప్యాక్ పక్కా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్ళీ కసరత్తులు మొదలెట్టాడు.! అదీ, తన తదుపరి సినిమా కోసం. ఈసారి పక్కా.. సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడు మహేష్‌బాబు.. అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి సినీ వర్గాల్లో.

సిక్స్ ప్యాక్ కోసం గతంలో మహేష్ ప్రయత్నించింది వాస్తవం. ఆయనే ఆ విషయాన్ని చెప్పాడు కూడా. కానీ, కటౌట్‌లో తేడాలొచ్చేస్తున్నాయనీ, ఛార్మింగ్ లుక్ పోతుందనీ, మహేష్ ఆ ప్రయత్నాన్ని అప్పట్లో విరమించుకున్నాడు.

అయితే, ఈసారి చేయబోయే సినిమా చాలా చాలా ప్రత్యేకమైనది గనుక, మహేష్ అన్ని జాగ్రత్తలూ తీసుకుని సిక్స్ ప్యాక్.. కాదు కాదు, ఎయిట్ ప్యాక్ ప్రయత్నాల్లో నిమగ్నమయిపోయినట్లు తెలుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా ‘గ్లోబ్‌ట్రోటింగ్’ కాన్సెప్ట్‌తో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే మహేష్, విదేశాలకు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. లుక్ టెస్ట్ సహా, సినిమాకి సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలపై ఈ టూర్‌లో మహేష్ చాలా చాలా కసరత్తులు చేయబోతున్నాడని అంటున్నారు.