దిల్‌రాజు కుటుంబం నుంచి వచ్చి హీరోగా తెరకు పరిచయమయ్యారు ఆశిష్. తొలి ప్రయత్నంలో ‘రౌడీ బాయ్స్’తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు రెండో ప్రయత్నంలో ‘లవ్ విూ’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘బేబీ’తో మెప్పించిన వైష్ణవి చైతన్య నాయికగా నటించడం.. టీజర్, ట్రైలర్లకు ఆదరణ దక్కడం.. ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అర్జున్ (ఆశిష్)కు దేవుడు, దెయ్యాలపై అసలు నమ్మకం ఉండదు. ఎక్కడైనా దెయ్యాలున్నాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్లి.. అవి లేవని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తుంటాడు. ఆ వీడియోలన్నింటినీ తన యూట్యూబ్ ఛానెల్లో పెట్టి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ విషయంలో అతనికి తన సోదరుడు ప్రతాప్ (రవికృష్ణ) కూడా సహాయ పడుతుంటాడు. ఈ క్రమంలో ఓసారి అర్జున్‌కు ప్రతాప్ ప్రియురాలు ప్రియ (వైష్ణవి చైతన్య) ద్వారా దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుస్తుంది. తెలంగాణ -కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ ఊరిలోని పాడుబడ్డ అపార్ట్మెంట్లో ఆ దెయ్యం తిరుగుతోందని.. ఆమె గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన చాలా మందిని హతమార్చిందని తెలుసుకుంటాడు. ఆ కథ విన్నాక అర్జున్ ఎలాగైనా ఆ దెయ్యాన్ని తన ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్తాడు.
మరి ఆ తర్వాత తనెలాంటి పరిణామాల్ని ఎదుర్కొన్నాడు? దివ్యవతి కథేంటి? ఆమెకు గతంలో కనిపించకుండా పోయిన పల్లవి, నూర్, ఛరిష్మాలకు ఉన్న సంబంధం ఏంటి? అసలు దివ్యవతి కథను అర్జున్ దగ్గరకు ప్రియ ఎందుకు చేర్చింది? అన్నది సినిమా కథ. విభిన్నమైన పాయింట్‌తో తెరకెక్కిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్. ఓ యువకుడు దెయ్యాన్ని ప్రేమలో దింపాలని ప్రయత్నిస్తే ఎలాంటి పరిణామాలెదురయ్యాయన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఇలాంటి కథ విషయంలో కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు అనుభవం సరిపోలేదనిపిస్తుంది. తాను రాసుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని లాజికల్‌గా ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెప్పడంలో తడబడ్డారు. దీనికి తోడు సినిమాలో ట్విస్ట్‌లా సెట్ చేసి పెట్టుకున్న అమ్మాయిల మిస్సింగ్ పాయింట్ కథను, ప్రేక్షకుల్ని పూర్తిగా గందరగోళానికి గురి చేసింది.
అర్జున్ చిన్నతనంలో తన ఊరిలో జరిగిన ఓ అసాధారణమైన మిస్టరీని చూపిస్తూ కథను ఆరంభించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. ఇక ఆ తర్వాత దెయ్యాలు లేవని నిరూపించడంలో అర్జున్ శక్తిసామర్థ్యాల్ని పరిచయం చేస్తూ ఓ హారర్ ఎపిసోడ్ తెరపైకి వస్తుంది. కానీ, అదంత థ్రిల్లింగ్‌గా అనిపించదు. అర్జున్ ప్రపంచం.. ప్రతాప్‌తో కలిసి చేసే ప్రయాణం.. ప్రియ పరిచయ సన్నివేశాలు.. అన్నీ సాదాసీదాగా అనిపిస్తాయి. ప్రియ.. దివ్యవతి కథను అర్జున్‌కు పరిచయం చేసినప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది.
ఆ దెయ్యాన్ని ప్రేమిస్తానంటూ అర్జున్ ఆమె అపార్టుమెంట్‌కు వెళ్లడం.. ఆరంభంలో అక్కడ తనకు ఎదురయ్యే అనుభవాలు.. అక్కడి ప్రపంచం.. అన్నీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. దీనికి తగ్గట్లుగానే ద్వితీయార్ధంపై అంచనాలు పెంచేలా విరామ సన్నివేశాల్ని తీర్చిదిద్దుకున్న తీరు బాగుంది. దివ్యవతి దెయ్యం కాదు బతికే ఉందని నిరూపించడం కోసం అర్జున్ చేసే అన్వేషణతో ద్వితీయార్ధం ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన ముగ్గురు అమ్మాయిల ఎపిసోడ్ తెరపైకి వస్తుంది.
ఇక ప్రియ పాత్రలోని ట్విస్ట్ ఊహలకు అందేదే అయినా అర్జున్ పాత్ర వెనకున్న చిన్న మిస్టరీ కాస్త సర్ప్రైజ్కు గురి చేస్తుంది. రెండో భాగానికి లీడ్ ఇస్తూ క్లైమాక్స్‌లో సెట్ చేసిన ట్విస్ట్ థ్రిల్లింగ్‌గానే ఉంది. దర్శకుడు అరుణ్ రాసుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపైకి తీసుకురాలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొంత వరకు కథ అక్కడక్కడే తిరిగిన అనుభూతి కలుగుతుంది. సెకండాఫ్‌లో బాగా కంగాళిగా తయారైంది. ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకి ఆకర్షణ. పాటలు మరీ గుర్తుంచుకునేలా లేవు. ఈ కథకు తగ్గట్లుగా పిసి శ్రీరామ్ డార్క్ టోన్డ్ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.