సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ చిత్రానికి చెందిన తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విష్ణు విశాల్, విక్రాంత్ ఈ ఫిల్మ్‌లో హీరో పాత్రలను పోషిస్తున్నారు. తలైవా రజనీకాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. స్పోర్ట్స్ కథాంశంతో తీసిన ఈ చిత్రాన్ని వాస్తవానికి పొంగల్ పండుగకు రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదావేశారు. మతం, రాజకీయం, క్రికెట్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఫిల్మ్‌లో విక్రాంత్, విష్ణు విశాల్ క్రికెటర్లు. ట్రైలర్‌లో ఓ దశలో లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ కూడా కనిపిస్తారు. లైకా ప్రొడక్సన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సుభాస్కరన్ దీన్ని ప్రజెంట్ చేశారు.
మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారు. క్రికెట్, ఫ్రెండ్‌షిప్ ప్రధాన కథాంశంగా సాగనున్నది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఈ ఫిల్మ్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ముంబై, చెన్నై, పుదుచ్చరిల్లో ఎక్కువ భాగాన్ని షూట్ చేశారు.
నా కూతురు ఐశ్వర్య ప్రతిభ ఏంటో నాకు తెలుసు. అందుకే ఇలాంటి కథను ఎంపిక చేసుకున్నందుకు నేను ఆశ్చర్యపోలేదని రజనీకాంత్ అన్నారు. వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ కథను వినేందుకు గంట సమయం కావాలని ఐశ్వర్య నన్ను అడగడంతో కాదనలేకపోయా.
ఈ సినిమా జాతీయ అవార్డులను అందుకుంటుందంటూ కథ చెప్పడం మొదలు పెట్టింది. వెంటనే నేను వినకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే అవార్డుల కోసమే సినిమాలు చేయకూడదు. అలాగని నేను వాటికి వ్యతిరేకిని కాదు. ఆర్థికంగా కూడా మంచి ప్రతిఫలం ఉండాలనుకున్నాను‘ అని అన్నారు.