Kuberaa: కుబేరపై ఓటీటీ ఒత్తిడి.. తేడా వస్తే 10 కోట్లు పోయినట్లే?

టాలీవుడ్‌లో థియేటర్‌లకు బదులు ఓటిటి ఫార్ములా ఎలా సినిమా భవితవ్యం మార్చేస్తోందో కుబేర తాజా ఉదాహరణగా మారింది. జూన్ 20న ఈ మల్టీస్టారర్ విడుదల కావాల్సిందేనన్న ఒత్తిడితో చిత్రబృందం స్పీడ్ పెంచింది. నాగార్జున, ధనుష్, రష్మిక కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నా, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం కొంత సమయం కావలసి ఉండగా… డేట్ల ఒత్తిడి వల్ల నిర్మాతలు వెనక్కి తగ్గలేని పరిస్థితిలో పడ్డారు.

ఇక్కడ ట్విస్టేంటంటే… ఓటిటి భాగస్వామిగా ఉన్న అమెజాన్ ప్రైమ్ జూన్ 20నే రిలీజ్ కావాలన్న ఒప్పందానికి కట్టుబడి ఉంది. తాము అడిగిన వాయిదా కోసం నిర్మాతలు మాట్లాడినా, డేటు మార్చితే 10 కోట్లు తగ్గిస్తామని ఓ షరతు పెట్టారు. దీంతో నిర్మాతలు ప్రాజెక్ట్‌ను జులైకి పోస్ట్ పోన్ చేయలేకపోయారు. ఈ విషయం గురించి నిర్మాత సునీల్ నారంగ్ స్వయంగా వెల్లడించటం గమనార్హం. ఆయన ప్రకారం, సినిమాని పూర్తిచేయటంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాలెన్స్ వర్క్ ఇంకా ఉండగా, ఖర్చు తగ్గించుకోవడానికే రన్ కంప్లీట్ చేయాల్సి వస్తోంది.

ఈ పరిణామాలు ఓటిటి సంస్కృతి ఇప్పుడు ఎలా పెను మార్పులకు దారి తీస్తుందో చెబుతున్నాయి. గతంలో డిజిటల్ విడుదల అనేది థియేటర్ రిలీజ్ తర్వాత జరిగేదిగా ఉండేది. కానీ ఇప్పుడు ఓటిటి సంస్థలు తామే విడుదల తేదీ డిక్టేట్ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అగ్ర నిర్మాతగా పేరున్న సునీల్ నారంగ్ దీనిపై స్పందిస్తూ – “ఇప్పుడు థియేటర్ బిజినెస్ మాదిరిగా కాదు.. ఓటిటి వాళ్లే సినిమాల దిశను నిర్ణయిస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.