అహనా పెళ్లంట…పిసినారి లక్ష్మీపతి… రావుగోపాలరావును కాదని కోటకు ఛాన్స్‌!

పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోగల అతికొద్ది మంది నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, హాస్యనటుడిగా ఆయన విభిన్న పాత్రలు పోషించారు. ఆయన నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలను చూస్తే, కోట శ్రీనివాసరావు తప్ప మరొకరు ఆ పాత్రలను చేయలేరేమో అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో ’అహ నా పెళ్ళంట’లోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఒకటి. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు అద్భుతంగా నటించారు.

ఇక అరగుండు పాత్ర బ్రహ్మానందంతో కలిసి కోట పండించిన  కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. తొలుత లక్ష్మీపతి పాత్ర కోసం రావుగోపాలరావును అనుకున్నారట.జంధ్యాల.. కోట శ్రీనివాసరావుతో ఆ పాత్రను చేయించాలని అనుకున్నారు. నిర్మాత డి.రామానాయుడు తొలుత అందుకు ఒప్పుకోలేదు. కానీ, పట్టుబట్టి ఒప్పించారు. ‘ఒకరోజు నేను చెన్నై వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా. అయితే అంతకుముందే రామానాయుడుగారు అక్కడి వచ్చి కూర్చున్నారు. అప్పట్లో నాలాంటి నటుడు ఆయనకు ఎదురుగా కూర్చొని మాట్లాడటం చాలా గొప్ప విషయం. నేను వెళితే.. ’ఇక్కడకు రావయ్యా! నీతో ఒక విషయం చెప్పాలి’ అన్నారు.

ఏంటి సర్‌? అని అడిగా, ‘జంధ్యాలతో ఒక సినిమా ప్లాన్‌ చేశాను. ఇవాళే ఫైనలైజ్‌ అయింది. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్‌ ఉంది. అది పండితే సినిమా చాలా బాగా ఆడుతుంది. లేకపోతే యావరేజ్‌గా ఆడుతుంది. ఆ పాత్ర గురించి నాకూ జంధ్యాలకు 20రోజులుగా చర్చ జరుగుతోంది. నేను రావుగోపాలరావుతో వేయిద్దా మనుకున్నా. కానీ, కోట శ్రీనివాసరావుతోనే ఆ పాత్ర వేయిస్తానని జంధ్యాల పట్టుబట్టారు. నేను సరే అన్నా. 20రోజుల పాటు నీ డేట్స్‌ కావాలి’ అని అడిగారు. తప్పకుండా సర్‌ అన్నా. ఆ తర్వాత ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. నా పాత్రకు మంచి పేరు వచ్చిందని ఆనాటి విశేషాలను కోట శ్రీనివాసరావు పంచుకున్నారు.