మెగాస్టార్ చిరంజీవికి ఎదురుచెప్పగల దర్శకుడు, నిర్మాత టాలీవుడ్‌లో ఎవ్వరూ లేరు.. ఉండరు కూడా. చిరు సెట్‌లోకి వచ్చాడంటే అంతా ఆయన అధీనంలోకి వెళ్లాల్సిందే. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటూ డైరెక్టర్‌ను పిలుస్తారేమో గానీ చిరు సెట్‌లోకి వస్తే అన్నీ ఆయనే అవుతాడు. అలా చిరంజీవికి 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి, లైటింగ్ ఎలా పెట్టాలి, కెమెరా ఎలా పట్టాలి ఇలా అన్ని విషయాల్లో చిరు చేయి తిరిగిన వాడే.
చిరంజీవి తన సినిమాల్లో కొన్ని సీన్లకు దర్శకత్వం వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చిరంజీవి దర్శకుడిని పనిని కూడా కాస్త తగ్గిస్తాడు. అయితే అక్కడ కొన్ని సందర్భాల్లో దర్శకుడి ఊహ, ఆలోచనలకు కత్తెర పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొరటాల లాంటి టాప్ డైరెక్టర్‌కు అలాంటి ఇబ్బందేమీ కలగకపోవచ్చు. కానీ ప్రతీ సీన్, షాట్ పట్ల చిరంజీవి ఎంతో కచ్చితంగా ఉంటాడంటూ కొరటాల చెప్పిన మాటలు వింటుంటే.. ఆయన కష్టం ఏంటో అర్థమవుతోంది.
తాజాగా ఆచార్య విశేషాలను చెబుతూ.. మా సినిమా ప్రారంభమైనప్పుడు ఆయన ఎంత ఉత్సాహంతో ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని చిరంజీవి గురించి చెప్పుకొచ్చాడు. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు.. ఆయన స్టార్ హీరో అని మనందరికీ తెలుసు.. మెగాస్టార్ ఇంతమంది ప్రేమాభిమానాలు పొందడానికి గల కారణమేమిటో ఆయనతో కలిసి పనిచేసినప్పుడే అర్థమవుతుందని అన్నాడు. ప్రతి షాట్, సీన్ విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారు. ఆయనకి అద్భుతైమన జ్ఞాపకశక్తి ఉందని కితాబిచ్చాడు.