‘డబుల్ ఇస్మార్ట్’‌లో కేతిక శర్మ.!

రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఢబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్‌’తో ఇటు రామ్ పోతినేని, అటు పూరీ జగన్నాధ్ ఇద్దరూ సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. దాంతో, అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ అనుకున్నారు. అయితే, వేరే ప్రాజెక్టులతో బిజీగా వుండడం వల్ల ఈ ప్రాజెక్ట్‌కి కాస్త పోస్ట్ పోన్ చేసి, ఇటీవలే పట్టాలెక్కించారు.

టైటిల్ కోసం పెద్దగా కష్టపడలేదు. శంకర్‌ని పక్కన పెట్టేసి, ఇస్మార్ట్‌కి డబుల్ కనెక్షన్ ఇచ్చేశారు. అలా ‘డబుల్ ఇస్మార్ట్’ అని పూరీ ఫ్యాన్స్‌కి క్యాచీగా కనెక్ట్ అయిపోయింది ఈ సినిమా టైటిల్. ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ల లిస్టు ఇంకా అనౌన్స్ చేయలేదు పూరీ జగన్నాధ్. అయితే, తాజాగా కేతిక శర్మ పేరు ఈ సినిమా కోసం తెర పైకి వచ్చింది.

ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఆ స్థాయిలో క్రేజ్ వున్న హీరోయిన్లనే ఎంచుకోవాలనుకుంటున్నాడు. బాలీవుడ్ నుంచి రప్పించాలనుకుంటున్నాడన్న ప్రచారం వుంది. అయితే, తాజాగా కేతిక పేరు వినిపిస్తుండడంతో ఆరా తీశారు. కేతిక హీరోయిన్ కాదట. ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతోందట. అలాగే, ఓ మాస్ మసాలా సాంగ్‌ని కేతికతో ప్లాన్ చేయబోతున్నాడట పూరీ జగన్నాధ్.

పూరీ జగన్నాధ్ రూపొందించిన ‘రొమాంటిక్’ సినిమాతోనే కేతిక హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. అందుకే పూరీ పిలవగానే కాదనలేకపోయిందట. చిన్న రోల్ అయినా ఓకే చేసేసిందనీ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ గాసిప్‌లో నిజమెంతో.!