కార్తీ మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా.! ఈసారి ఏ హీరోతో.!

తమిళనటుడు కార్తీ, తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితుడే. నిజానికి, తెలుగు హీరోలానే కనిపిస్తాడు. తెలుగు బాగా మాట్లాడతాడు కూడా. అన్నయ్య సూర్య కంటే, తమ్ముడు కార్తీనే తెలుగు ప్రేక్షకులకు బాగా అలవాటైపోయాడు.

తెలుగులో అక్కినేని నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించాడు కార్తీ. నాగార్జున, కార్తీ.. రియల్ లైఫ్ అన్నదమ్ములన్న భావన కలిగింది చాలామందికి. కార్తీ అంతే.! అంతలా కనెక్ట్ అయిపోతాడు, కనెక్ట్ చేసేసుకుంటాడు.! ఆయనకి ఆడియన్స్ కూడా అలాగే కనెక్ట్ అయిపోయారు తెలుగు రాష్ట్రాల్లోనూ.

అసలు విషయానికొస్తే, కార్తీ ఇంకో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించబోతున్నాడట. ఈసారి కూడా ఓ పెద్ద హీరో సినిమాలోనే నటిస్తాడట. ఎవరా పెద్ద హీరో.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

కథా చర్చలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయనీ, ఆ పెద్ద హీరో.. అగ్ర హీరో కూడా అయిన ఆ సీనియర్ హీరో, కార్తీ అయితే ఆ సినిమాలోని కీలక పాత్రకు బాగా సూటవుతాడని సూచించడంతో, దర్శక నిర్మాతలు ‘సరే’ అనక తప్పలేదట.

ఆ హీరో అంటే కార్తీకి వల్లమాలిన అభిమానం. దాంతో, ‘నో’ చెప్పే ప్రసక్తే వుండదు. కాకపోతే, సినిమా ప్రారంభమవడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు. ఈ ఏడాది చివర్లో వుంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

అన్నట్టు, కార్తీ పలు తమిళ సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.