ఆ సీనియర్ నటుడి సతీమణి కన్నుమూత !

అలనాటి మేటి నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు సతీమణి హైమావతి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ లోని మల్లాపూర్‌ లో నివాసం ఉంటున్న ఆమె ఈ మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఆమె మరణాన్ని ధ్రువీకరించారు. హైమావతి మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

తెలుగు చిత్రసీమలో జానపద చిత్రాలకు పెట్టింది పేరు కాంతారావు. కత్తి వీరుడు కాంతారావు అనేంతగా ఆయన ప్రజల హృదయాల్లో చెరగనిస్థానం సంపాదించుకున్నారు. కాంతారావు 2009లో కన్నుమూయగా, తాజాగా ఆయన అర్ధాంగి హైమావతి తుదిశ్వాస విడిచారు. హైమావతి వయసు 87 సంవత్సరాలు.

నటుడు కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, కాంతారావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలు పెన్షన్ గా అందిస్తోంది. కాంతారావు చరమాంకంలో ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంతారావు తన కెరీర్లో జానపద చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు. దర్శకుడు విఠలాచార్యతో ఆయన కాంబినేషన్ బాగా హిట్టయింది.