చిత్రసీమలో కొనసాగాలా వద్దా అన్నది ప్రేక్షకుల నిర్ణయం: ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో కంగనా రనౌత్‌

నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారంటూ వస్తోన్న వార్తలపై కంగనా రనౌత్‌ మరోసారి స్పందించారు. తన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ఇండస్ట్రీలో కొనసాగాలా.. లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారన్నారు. ’నేను నటిగా కొనసాగాలా.. వద్దా అనేది ప్రేక్షకుల తీర్పుపై ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ప్రజలు నన్ను గెలిపించి నాయకురాలిని చేశారు. ఏ పార్టీ తరఫున పోటీ చేశాననేది పక్కన పెడితే.. నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు బలంగా కోరుకున్నారు. అందుకే నన్ను గెలిపించారు.

అలాగే ‘ఎమర్జెన్సీ’ ఫలితంపై నా నటన జీవితం ఆధారపడి ఉంది. నేను అనుకున్న విజయం సొంతమైతే ఇండస్ట్రీలో ఉంటాను. ఒకవేళ రాజకీయాల్లో నా అవసరం ఎక్కువ ఉందని భావిస్తే ఆ రంగంలోనే కొనసాగుతా. మనకు అవసరమైన, గౌరవనీయమైన చోట ఉండాలి. ప్రస్తుతానికి ఈ విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పారు.

ఇక కంగనా నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. పలు వాయిదాల అనంతరం సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నిర్మాతగానూ వ్యవహరించిన కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించారు. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్‌ తల్పడే కనిపించనున్నారు.