చెన్నై వేదికగా జరిగిన ఓ సభలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు కన్నడ రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీశాయి. “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అంటూ మాట్లాడిన ఆయన, కన్నడిగుల కోపానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలపై కన్నడ అనుకూల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ కూడా వేదికపై ఉండగా, కమల్ చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో ఉండేంతవరకు నవ్వులు పంచుకున్నా, సభ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై బీజేపీ నేత విజయేంద్ర యడియూరప్ప ఘాటుగా స్పందించారు. “ఇది మాతృభాషపై అవమానం. కమల్ హాసన్ ఓ సంస్కారహీన వ్యక్తిగా ప్రవర్తించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి” అంటూ మండిపడ్డారు. అదేగాక, గతంలో హిందూ మతాన్ని టార్గెట్ చేసిన కామెంట్లను కూడా ఆయన మరోసారి గుర్తు చేశారు. “ఇలాంటి వ్యాఖ్యలు దక్షిణ భారతదేశ సామరస్యాన్ని దెబ్బతీయడమే కాదు, రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతున్న చర్యలుగా కనిపిస్తున్నాయి” అని ఆయన విమర్శించారు.
ఇక కమల్ వ్యాఖ్యలపై కన్నడ రక్షణ వేదిక కూడా ఆగ్రహంతో పోటెత్తింది. బెంగళూరులోని థియేటర్లపై వారి నిరసన మొదలైంది. “తగ్ లైఫ్” సినిమా పోస్టర్లు చించివేస్తూ సినిమాను నిషేధిస్తామని హెచ్చరిస్తున్నారు. “కన్నడను తక్కువ చేస్తే, తమిళనాడు అయినా, బాలీవుడ్ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా అయినా సహించం” అని స్పష్టం చేశారు.
కమల్ హాసన్ తాజా చిత్రం తగ్ లైఫ్పై ఈ వివాదం బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నా, ఆయన ఇప్పటికీ స్పందించకపోవడం మరో వివాదానికి తలుపులు తెరిచేలా ఉంది. తాజా పరిస్థితుల్లో సినిమా ప్రచారానికి ఇది అనుకూలంగా మారుతుందా? లేదంటే తీవ్ర ప్రతిఘటనకు దారి తీస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ.