90ల సమయంలో హీరోలతో పాటు సమానంగా హీరోయిన్‌లకు మంచి గుర్తింపు ఉండేది. కాని ఇప్పుడలా కాదు కథానాయికని కేవలం పాటల కోసమో లేదంటే కొద్ది సేపు రొమాన్స్ కోసమో అన్నట్టు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ భామలు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్నట్టు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ కొద్ది సేపు పాత్రకైన సై అంటున్నారు.అంతేకాదు సినిమా కోసం పర్సనల్ లైఫ్‌లోని కొన్ని ముఖ్య ఘట్టాలకు కూడా బ్రేక్ ఇచ్చి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.
15 ఏళ్ళుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నకాజల్ అగర్వాల్ కొద్ది రోజుల క్రితం కుమారి నుండి శ్రీమతిగా మారింది. పెళ్లి, రిసెప్షన్, వ్రతం, కర్వా చౌత్ ఇలా అన్ని వేడుకలని పూర్తి చేసుకున్న ఈ అమ్మడు తన భర్తతో కలిసి కరోనా లేని ప్రాంతానికి హనీమూన్‌గా వెళదామనుకుంది. కాని ఆచార్య చిత్ర టీం నవంబర్ 9 నుండి నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీంతో చేసేదేం లేక హనీమూన్‌ని క్యాన్సిల్ చేసుకొని షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. పెళ్లైన కొద్ది రోజులకే కాజల్ ఇలా షూటింగ్‌లో పాల్గొనాల్సి రావడంతో అభిమానులు కూడా అసంతృప్తిగా ఫీలవుతున్నారు.
గతంలో సమంతకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 2017 అక్టోబర్ లో నాగ చైతన్య, సమంత పెళ్లి కాగా, ఆ సమయంలో రంగస్థలం చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. కొంత బ్రేక్ ఇచ్చే ఛాన్స్ కూడా సమంతకు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో షూటింగ్‌కు హాజరైంది. కుమారిగా మొదలు పెట్టి శ్రీమతిగా సినిమాని పూర్తి చేసిన సామ్ ఈ చిత్రంతో మంచి విజయం తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కాజల్‌కి కూడా అదే సెంటిమెంట్ వర్తిస్తుందా అనేది చూడాలి. కాజల్ నటిస్తున్న ఆచార్య వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు కాజల్ భారతీయుడు2, మోసగాళ్ళు, ముంబై సాగా అనే చిత్రాలు చేస్తుంది.