18 ఏళ్ల క్రితం విడుదలైన ‘నువ్వు నేను ప్రేమ’లో జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు సూర్య, జ్యోతిక. ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వారు భార్యాభర్తలుగా కనిపించారు. ఇందులోని ఓ సన్నివేశంలో జ్యోతిక తన భర్తను.. ఒక్కరోజుపాటు ఆయన మాజీ ప్రియురాలు వద్దకు పంపిస్తుంది.
ఈ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ తాజాగా ఓ యువతి జ్యోతికకు పోస్ట్ పెట్టింది. ‘సైతాన్’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు నటి జ్యోతిక. చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. మేడమ్.. ‘నువ్వు నేను ప్రేమ’లో మాదిరిగా సూర్యను ఒక్కరోజు నాకు అప్పుగా ఇస్తారా? ఎందుకంటే 15 ఏళ్ల నుంచి ఆయనకు నేను వీరాభిమానిని అని కామెంట్ పెట్టింది. అది కుదరదు అంటూ జ్యోతిక రిప్లై ఇచ్చారు. ఆమె నుంచి రిప్లై వచ్చేసరికి ఆ యువతి సంబరపడింది. ఓ మై గాడ్.. ఆయన ఎప్పటికీ మీ వారే అని పేర్కొంది.