టాలీవుడ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల లావాదేవీలపై ఈ దాడులు జరగడం గమనార్హం. మొదట “పుష్ప 2: ది రూల్” ప్రీ రిలీజ్ వేడుకలో వందల కోట్ల బిజినెస్ చేసినట్లు ప్రకటించడం ఐటీ అధికారుల దృష్టిని ఆకర్షించిందని ఒక టాక్ వినిపిస్తోంది. భారీ కలెక్షన్స్ అంటూ ఆర్భాటాలకు పోయి ఈ విధంగా పీక మీదకు తెచ్చుకున్నారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
వివిధ పెద్ద నిర్మాణ సంస్థలు, అందుకు సంబంధించిన మీడియా సంస్థలపై ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు బ్యానర్లు ప్రధానంగా ఈ దాడులలో హైలెట్ గా మారాయి. సంక్రాంతి సినిమాల లావాదేవీలతో పాటు పాన్ ఇండియా చిత్రాలకు సంబంధించి ఉన్న ఆర్థిక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. వందల మంది ఐటీ అధికారులు నాలుగు రోజులపాటు ఈ దాడులు కొనసాగించనున్నట్లు సమాచారం.
పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన లావాదేవీలలో పారదర్శకత లేకపోవడం, కలెక్షన్లపై సరైన పన్ను చెల్లించని అనుమానాలు దాడులకు కారణమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కలెక్షన్లను అతిశయంగా చూపించడం, ప్రచారంలో ఆ వివరాలను వాడడం నిర్మాతలకు ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితులు పరిశ్రమలో ఆర్థిక వ్యవహారాలు మరింత పారదర్శకంగా ఉండాలనే పిలుపు తెచ్చాయి.
ఈ దాడులు టాలీవుడ్ పరిశ్రమలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై కొత్త చర్చలకు తెరతీశాయి. పబ్లిసిటీ కోసం చెప్పిన మాటలు, చూపించిన డేటా నిర్మాతలకు గుణపాఠంగా మారతాయని భావిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు ఇకపై జాగ్రత్తలు తీసుకుంటే, ఈ పరిస్థితులను నివారించవచ్చు.