సుకుమార్ అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ..ముత్యంశెట్టి మీడియా తో కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
కాగా రీసెంట్ గా పుష్ప సినిమాని ఈ ఏడాది ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ కి ఫస్ట్ పాన్ ఇండిన్ సినిమా కావడంతో మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మారేడుపల్లి అడవుల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా త్వరలో లొకేషన్ మార్చి అల్లు అర్జున్ – రష్మిక మందన్న మీద ఒక సాంగ్ ని చిత్రీకరించనున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే ‘పుష్ప’ రిలీజ్ డేట్ పరంగా దర్శకుడు సుకుమార్ అసంతృప్తిగా ఉన్నాడన్న మాట వినిపిస్తోంది. ‘పుష్ప’ షూటింగ్ ఇంకా 170 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో అప్పుడే విడుదల తేదీని నిర్ణయించడంతో సుకుమార్ మీద ఒత్తిడి బాగా పెరుగుతుందని చెప్పుకుంటున్నారట. వాస్తవంగా సినిమా క్వాలిటీ విషయంలో సుకుమార్ కాంప్రమైజ్ కాడు. అంతేకాదు అవసరమైతే సీన్స్ విషయంలో రీ షూట్ చేయడానికి కూడా ఆలోచించడు. ఇలాంటి నేపథ్యంలో దాదాపు 6 నెలలు ముందుగా రిలీజ్ డేట్ ని ప్రకటించడం తో సుకుమార్ ఇబ్బందిపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాల రిలీజ్ డేట్స్ వరసగా అనౌన్స్ చేయడంతో ఉన్నపలంగా పుష్ప రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసినట్టు సమాచారం.