సోనాల్ కాదు మృణాల్.!

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ప్రాజెక్ట్‌‌లో హీరోయిన్ విషయమై ఈ మధ్య బోలెడంత గందరగోళం నడించింది.

నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్ నుంచి ఈ సినిమాకి హీరోయిన్ పట్టుకొస్తాడట రాజమౌళి అన్నారు. అవును మరి, ప్యాన్ ఇండియా.. కాదు కాదు ప్యాన్ వరల్డ్ మూవీ కదా.. రాజమౌళి సినిమా అంటే. ఆ రేంజ్ ఫేమ్ వున్న హీరోయిన్‌నే పట్టుకు రావాలి మరి.

సో, బాలీవుడ్ నుంచి స్టార్ ఇమేజ్ వున్న ముద్దుగుమ్మని సెలెక్ట్ చేస్తాడేమోలే అనుకున్నారంతా. అయితే, ఇటీవల సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్ అంటూ తెగ ప్రచారం జరిగింది.

సోనాల్ చౌహాన్.. అంటే ఏమంత ఫేమ్ వుంది. సరైన హిట్టు ఒక్కటి కూడా లేదింతవరకూ సోనాల్ చౌహాన్‌కి. నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చేసినప్పటికీ సెకండ్ హీరోయిన్ రోల్స్‌లోనే నటించింది.

‘ది ఘోస్ట్’లో నాగార్జునతో నటించినప్పటికీ అది పెద్ద డిజాస్టర్. అలాంటిది సోనాల్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఏంటని నెటిజన్లు రచ్చ రంభోళా చేశారు.

ఆ సంగతి అలా వుంటే, తాజాగా మృణాల్ ఠాకూర్ పేరు తెర పైకి వచ్చింది. సోనాల్ కాదు, మృణాల్ అట.. అంటూ తాజాగా ప్రచారం జోరందుకుంది.

మృణాల్‌కి ‘సీతారామం’ సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఒకింత తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది మృణాల్ ఠాకూర్.

సో, మృణాల్ ఠాకూర్ అయితే, ఒకింత సినిమాకి కలిసొచ్చే అంశమే అంటున్నారు కొందరు. నవంబర్‌లో లుక్ టెస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ఆ తర్వాతే ఎవరు ఫైనల్ అవుతారో.. ఓ క్లారిటీ రానుంది.