మృనాల్ ఠాకూర్ ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులోనా.?

మృనాల్ ఠాకూర్.. ఈ పేరు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మార్మోగిపోతోందనడం అతిశయోక్తి కాదేమో.! ఒకే ఒక్క సినిమా.. అదే ‘సీతారామం’.! ఆ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది అందాల భామ మృనాల్ ఠాకూర్.

ఇటీవల వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాతో మరో హిట్టుని తన ఖాతాలో వేసుకున్న మృనాల్ ఠాకూర్, త్వరలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరో.

ఇప్పుడీ బ్యూటీ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగం కాబోతోందిట. పైగా, అది పాన్ ఇండియా సినిమా కాబోతోందిట. కాదు కాదు, అది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్..! అదే, మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్‌బాబు మీద లుక్ టెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేష్, చాలా చాలా గట్టి కసరత్తులే చేయబోతున్నాడు. సిక్స్ ప్యాక్ చూపిస్తాడని అంటున్నారు.

మరోపక్క, మృనాల్ ఠాకూర్‌తో త్వరలో ఈ సినిమా కోసం స్క్రీన్ టెస్ట్ చేయించనున్నారన్నది తాజా ఖబర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్‌గా మృనాల్ ఠాకూర్ బెస్ట్ ఆప్షన్ అని అటు రాజమౌళి, ఇటు మహేష్ అనుకుంటున్నారట.

అందానికి అందం, నటనకు నటన.. వీటికి తోడు అనూహ్యమైన పాపులారిటీ.. ఇవన్నీ మృనాల్ ఠాకూర్‌కి అడ్వాంటేజెస్. సో, మహేష్ – రాజమౌళి ప్రాజెక్టుకి అదనపు స్పైసీనెస్ యాడ్ అయినట్టే కదా.?