భగవంత్ కేసరి.. హిట్టేనంటే నమ్మరేంటి.?

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ సినిమాకి దసరా సీజన్ బాగానే కలిసొచ్చింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా కాస్తా, నష్టాల నుంచి కొంత మేర బయటపడింది.

‘టైగర్ నాగేశ్వరరావు’ సోదిలోకి కూడా లేకుండా పోయింది. ‘లియో’ సినిమా అడ్రస్ గల్లంతయ్యింది. అలా అన్నీ కలిసొచ్చాయి ‘భగవంత్ కేసరి’ సినిమాకి. ‘దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది..’ అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించేశాడు.

కానీ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు వేరేగా వున్నాయి. కాస్త బెటర్ అనుకున్న చోట్ల నష్టాలు మరింత పెరుగుతున్నాయి. ఎక్కువ థియేటర్లలో సినిమా ఆడిస్తుండడం, ఆయా థియేటర్లలో ఆక్యుపేషన్ చాలా తక్కువగా వుండడమే అసలు సమస్య.

వేరే సినిమాలు చెప్పుకోదగ్గవి ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులు, ‘భగవంత్ కేసరి’ సినిమాని చూడ్డానికి వస్తున్నారా.? అంటే, అదీ లేదాయె. థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోయి చాన్నాళ్ళే అయ్యింది.

శుక్రవారం విడుదలయ్యే సినిమా, సోమవారానికి ఔట్ అయిపోతోంది. అయితే, బాలయ్య అభిమానులు ఈ సినిమాని తమ భుజానికెత్తుకుని కష్టపడుతున్నారు. టీడీపీ శ్రేణులూ నానా తంటాలూ పడుతున్నాయి. అందుకే, ‘సినిమా హిట్టే..’ అని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయగలుగుతోంది చిత్ర యూనిట్.