దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల తార ఇలియానా. పోకిరి సినిమాతో ఫుల్ ఫేమ్ సంపాదించిన ఇల్లీ బేబి మెల్లగా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లింది. ఆ సమయంలోనే విదేశీ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. ఆ సమయంలో కాస్త సినిమాలు తగ్గించిన గోవా బ్యూటీ మళ్ళీ తిరిగి వరుస సినిమాలు చేసే ప్రయత్నం చేసింది. కాని చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో అమ్మడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినా కూడా ఇలియానాకు కలిసి రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్‌లీ’ చిత్రంపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంది.
బల్వీందర్ సింగ్ జనుజ దర్శకత్వంలో రణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్‌లీ’ అనే చిత్రం చేస్తున్న సమయంలో చేతికి గాయమైందట. వెంటనే గాయమైన చేతిని ఫొటో తీసి ట్విట్టర్‌లో షేర్ చేసింది. దానికి కామెంట్‌గా ‘రొమాంటిక్ కామెడీ సినిమా షూటింగులో ఎవరైనా గాయపడతార?..’ అంటూ ఫన్నీ కామెంట్ కూడా పెట్టింది. అంతేకాదు ఓ జిఫ్ ఇమేజ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే రొమాంటిక్ కామెడీ చిత్రాలలో రొమాంటిక్ సీన్స్‌కే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ సన్నివేశాలలో ఏమైన గాయం అయి ఉంటుందా అని అభిమానులు ఆలోచనలు చేస్తున్నారు. తాను క్షేమంగానే ఉన్నా అని ఇలియానా చెప్పినా కూడా అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు
అసలు రొమాంటిక్ సీన్ షూట్ చేస్తుంటే చేతికి ఎలా గాయమైందో చెప్పాలంటూ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు.ప్రస్తుతం ఇలియానా చేస్తున్న ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్‌లీ’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ తో కలసి మూవీ టన్నెల్ ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెల్లని మేని ఛాయ పట్ల మన దేశంలోని అమ్మాయిలలో వుండే వ్యామోహాన్ని ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని వినోద భరితంగా తెరకెక్కిస్తారు. నల్లని మేని ఛాయ గల ఒక యువతి ఈ ‘వర్ణ’ వివక్షకు వ్యతిరేకంగా జరిపే పోరాటాన్ని ఇందులో ఫన్నీగా చెప్పనున్నారు. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రు నీబోన్ తో లవ్ బ్రేకప్ అయ్యాక ఇలియానా మళ్లీ సినిమా కెరీర్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.