Sreekanth: సినిమాలు ఫ్లాప్ కావడంతో వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా.. చిరంజీవి గారు పిలిచి ఒక్కటే చెప్పారు: హీరో శ్రీకాంత్

Sreekanth: ప్రేయసి రావే సినిమాకు ముందు వరుసగా 6 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయని ప్రముఖ నటుడు శ్రీకాంత్ అన్నారు. అంతే కాకుండా ఆ సినిమాలన్నీ కూడా పెద్ద బ్యానర్లలో, పెద్ద డైరెక్టర్లతో తీసినవేనని, అయినా కూడా అవి ఫ్లాప్ అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చిరంజీవి గారితో ఎలాంటి కాంటాక్ట్‌ లేకుండా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

మామూలుగా అయితే చిరంజీవి గారితో ఎప్పుడూ కలవకపోయినా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడినన్న శ్రీకాంత్, ఒక మూడు నెలల పాటు అసలు ఆయనతో మాట్లాడలేదని శ్రీకాంత్ తెలిపారు. ఆ టైంలో ఎవరితోనే ఆయన కబురంపించారని, శ్రీకాంత్‌ని రమ్మని చెప్పు, ఒకసారి కలవాలని ఆయన అన్నారు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో అన్నయ్య షూటింగ్‌లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లానని శ్రీకాంత్‌ చెప్పారు.

అప్పట్లో ఈ ఫెయిల్యూర్స్‌ని తట్టుకోలేకపోయేవాడినని, ఫెయిల్ అయితే మనల్ని ఎవరూ పట్టించుకోరేమో, మనల్ని ఎవడో అన్నట్లు చూస్తారేమోనని అనుకునేవాడినని ఆయన అన్నారు. అందుకే అందరితోనూ ఎక్కువగా కలిసేవాడిని కాదని ఆయన చెప్పారు. ఫ్లాప్ అయ్యాయి మన మూవీస్ అంటే ఒక అవమానంలా ఫీల్ అయ్యే వాళ్లమని ఆయన అన్నారు. ఆ సమయంలోనే చిరంజీవి గారు పిలిచారని, ఒక గంటసేపు షూటింగ్ ఆపి మరీ, తనతో కూర్చొని, అసలేంటి, ఎందుకు అని అడిగారని శ్రీకాంత్‌ చెప్పారు. అప్పుడు జరిగిందంతా చెప్పానని, ఊరుకెళ్లి వ్యవసాయం చేసుకుందామనుకుంటానని కూడా చెప్పానని ఆయన తెలిపారు. అది విన్న అన్నయ్య ఆయన తన కెరీర్‌లో ఎదుర్కొన్నవన్నీ చెప్పారని, హిట్, ఫ్లాప్ అనేవేవీ మన చేతిలో ఉండవని, మనం నమ్ముకొని చేసుకుంటూ వెళ్లిపోవాలన అని ఓ గంట సేపు అన్నీ మాట్లాడి తన మైండ్‌ను రీఫ్రెష్ చేశారని శ్రీకాంత్‌ చెప్పారు. ఆ రోజు నుంచీ ఈ రోజు వరకు ఫ్లాఫ్‌లు గానీ, ఏమైనా గానీ ఏమీ పట్టించుకోవట్లేదని ఆయన స్పష్టం చేశారు.