Diwali: ప్రతి ఇంటా దీపాల వెలుగులు నింపే పండుగ దీపావళి. చీకటిపై వెలుగు, చెడుపైన మంచి, అజ్ఞానం మీద జ్ఞానం సాధించిన గెలుపునకు ప్రతీక ఈ పండుగ. దీపావళికి ఒక్కోచోట ఒక్కో విధమైన కథ ప్రచారంలో ఉంది. అలాగే బౌద్ధంలోనూ ఓ కథ ప్రచారంలో ఉంది. ప్రతి ఆషాఢ మాసంలో బౌద్ధ భిక్షువులకు వర్షావాసం ప్రారంభ మవుతుంది.
ఆ కాలంలో మూడు నెలల పాటు భిక్షువులు ప్రజల వద్దకు భిక్ష కోసం వెళ్ళరు. అడవుల్లో, గుహల్లో ఉండి… దొరికింది తింటూ, ధ్యానంలో, విద్యలో ప్రత్యేక స్వయం శిక్షణ సాగిస్తారు. ఇలా వర్షావాసం పూర్తి చేసి, ఆశ్వయుజ మాసంలో తిరిగి గ్రామాలకు బయలుదేరుతారు. గ్రామాలకు వచ్చే భిక్షువులకు దారి పొడవునా దీపాలతో ప్రజలు స్వాగతం పలుకుతారు. అదే దీపావళిగా, బౌద్ధుల ధర్మ దీపావళిగా ప్రసిద్ధం చెందింది. బౌద్థులు మరణాన్ని నిర్వాణం అంటారు.
నిర్వాణం అంటే దీపం ఆరిపోవడం. ప్రమిదలోని నూనె, వత్తీ పూర్తిగా మండిన తరువాత ఇక దీపం వెలుగదు. అదే నూనె, అదే వత్తి ఇక ఉండవు. అంటే… అదే దీపాన్ని ఇక ఎప్పటికీ వెలిగించలేం. మనిషి నిర్వాణం తరువాత కూడా అంతే! ఇలా అనిత్యత్వాన్నీ, అనాత్మవాదాన్నీ దీపంతో పోల్చి చెబుతుంది బౌద్ధం. మరణించిన వ్యక్తి తల దగ్గర దీపం ఉంచే సంప్రదాయం బౌద్ధ భిక్షువుల నిర్వాణం నుంచి పుట్టినదే! స్తూపాల మీద దీపాలు ఉంచే ఆచారం కూడా దాన్నుంచి వచ్చిందే! అందుకే మరణాన్ని దీపం ఆరడంతో పోలుస్తాం.
మనుషులు చీకటి నుంచి వెలుగులోకి, వెలుగు నుంచి వెలుగులోకి నడవాలని అంటుంది బౌద్ధం. చీకటి నుంచి వెలుగులోకి నడవడం అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు పయనించడం అని అర్థం. వెలుగు నుంచి వెలుగులోకి’ అంటే ’విజ్ఞానం నుంచి శీలం వైపు పయనించడం’ అని అర్థం. ఇలా మనిషికి శీలం, విజ్ఞానం ఈ రెండూ కలిసి ఉంటేనే పరిపూర్ణత. వేల ఏళ్ల క్రితమే బౌద్ధంలో దీప పూజ మొదలయింది. బౌద్ధ స్తూపాల దగ్గర, బౌద్ధ ఆరామాల్లో వందలాది దీపాలు వెలిగించేవారు.
బౌద్ధ ధర్మోపన్యాసాలు, దాన కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను దీపాలతో నింపేవారు. తమ గ్రామానికి బుద్ధుడు భిక్షువులతో కలిసి వచ్చిన సందర్భాల్లో ఇంటింటా దీపాలను వెలిగించి, ఆహ్వానం పలికే సంప్రదాయం బలీయంగా సాగింది. ఇల్లు వొదలి వచ్చిన సిద్దార్థుడు ఆరేళ్ళు కృషి చేసి, చివరకు జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. సారనాథ్‌లో మొదటి వర్షావాసం ముగించి రాజగృహకు వొచ్చాడు. ఆ సమయంలో… బుద్ధుడైన తన బిడ్డను కపిలవస్తు నగరానికి తీసుకురావాలని మంత్రుల్ని ఆయన తండ్రి శుద్ధోధనుడు ఆదేశిస్తాడు.
చివరకు సిద్దార్థుడి బాల్య మిత్రుడైన కాలు ఉదాయిని పంపుతాడు. కాలు ఉదాయి బుద్దుణ్ణి వెంటబెట్టుకొని కపిలవస్తుకు వస్తాడు. ఆ సందర్బంలో బుద్ధునికి శుద్ధోదనుడు దారిపొడవునా దీపాలు వెలిగించి స్వాగతం పలికాడు. ఆ రోజు రాజ్యమంతటా దీపాలు వెలిగించారు. అలా బుద్ధుడి కపిలవస్తు నగర పునరాగమనానికి సంకేతంగా దీపాలు వెలిగి బౌద్ధ సంప్రదాయంగా నిలిచిపోయిందని అంటారు.