సౌత్ చక్రం తిప్పబోయే నెక్స్ట్ హీరోయిన్స్

సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఎప్పుడు ఏ రంగు హైలైట్ అవుతుందో ఎవరూ చెప్పలేం. అసలీ చిత్రసీమలో కొత్తదనం కోసం నిరంతరం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. కథ, కథనం, తారాగణం, సాంకేతికత.. ఇలా అన్నింట్లోనూ వైవిధ్యమే కావాలి. ప్రేక్షకుల అభిరుచే అందుకు కారణం. కొత్తగా ఉంటుందని ఏ విషయంలో అనిపించినా సరే, రెడ్​ కార్పెట్​ పరిచి స్వాగతం పలుకుతుంటాయి సినీ వర్గాలు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమ.. అందులోనూ హీరోయిన్ల విషయానికొస్తే.. ఇది ఓ పుష్పక విమానం.

ప్రతి ఏటా ఎంతమంది కొత్త తారలొచ్చినా.. మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది. అయితే అలా వచ్చీ రాగానే విజయాన్ని అందుకొని.. వరుస అవకాశాలతో దూసుకెళ్లే తారలు తక్కువ సంఖ్యలోనే ఉంటారు. జోరు చూపించిన కొత్త నాయికలు కెరీర్​లో రాణిస్తూ స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలాంటి వారిలో ప్రస్తుతం మృణాల్​ ఠాకూర్​, శ్రీలీల ఉన్నారు.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో సీతారామం బ్యూటీ మృణాల్​ ఠాకూర్ వినిపిస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి ప్రేమకావ్యంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ సీత పాత్రలో నటించి ప్రేక్షకుల మదిని దోచేసింది. అయితే ఆ విజయాన్ని ఆమె జాగ్రత్తగా మలుచుకుంటోంది. వరుసగా అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తున్నా ఆచితూచి అడుగులు వేస్తోంది.

ముఖ్యంగా దక్షిణాదిలో ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రమే ఒకే చేసింది. అది కూడా తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన 30వ చిత్రంలో మెరవనుంది. ఈ సినిమాతో శౌర్యువ్‌ అనే మరో కొత్త దర్శకుడు తెరకు పరిచయమవుతున్నారు. చెరుకూరి మోహన్‌, విజయేందర్‌ రెడ్డి, మూర్తి కలగర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఆమె ఖాతాలో అన్ని హిందీ సినిమాలే ఉన్నాయి. అందులో సెల్ఫీ, గుమ్రాపూజా మెరీ జాన్​, పిప్పా, ఆంఖ్​ మికోలి వంటి బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి.

ఇక శ్రీలీల విషయానికొస్తే… ఒకవైపు తన చదువు కొనసాగిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన పెళ్లిసందడితో తెలుగు తెరకు పరిచయమైన ఈమె… వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. ఇక రీసెంట్​గా తన రెండో చిత్రంలోనే రవితేజతో నటించి ధమాకా హిట్​ను అందుకుంది. యూత్​లో గ్లామర్​ హీరోయిన్​గా మంచి పేరు తెచ్చుకుంది. డ్యాన్స్​లతోనూ అదరగొడుతోంది. ఈమె అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అందుకే దర్శకునిర్మాతలు కూడా ఈ భామనే ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా ప్రస్తుతం ఈ అమ్మడు నాలుగు ఆఫర్లను దక్కించుకుంది.

ఏకంగా సూపర్​స్టార్ మహేశ్​బాబుతో కలిసి SSMB 28లో స్క్రీన్​ షేర్​ చేసుకోనుంది. ఇక బోయపాటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తోంది. ఇంకా అనగనగా ఒక రాజు, జూనియర్​ అనే చిత్రాల్లోనూ నటిస్తోంది. అలా ఈ ఇద్దరూ హీరోయిన్లు వరుస సినిమా ఆఫర్లతో ప్రస్తుతం జోరు మీదున్నారు. వీరిద్దరి కొత్త సినిమాలు హిట్టైటే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఖాయమే.