ఇకపై మరింత కష్టపడతానంటోన్న సమంత!?

నటిగా దక్షిణాదిలోని అగ్రతారల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. ఇటీవలే ఆమె మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఐఎండీబీ ఇటీవలే గత దశాబ్దంలో ఎక్కువ మంది చూసిన భారతీయ సెలబ్రిటీల జాబితా పై సర్వే నిర్వహించింది. ఇందులో సమంతకు 13వ స్థానం లభించింది. ఈ విషయంపై ఆమె స్పందించారు.

‘నటిగా ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా కృషికి, అదృష్టానికి తగిన ప్రతిఫలం. ఇండస్ట్రీలో ఇన్నేళ్లు ఎలా గడిచాయో తెలియట్లేదు. కెరీర్‌ను ఇప్పుడిప్పుడే మొదలుపెడ్తున్నట్టు ఉంది. వరుస సినిమాల్లో నటించేందుకు అద్భుతమైన పాత్రలు వస్తున్నాయి. ఇకపై తాను నటించే ప్రతీ సినిమాలో అభిమానుల కోసం రెట్టింపు కష్టపడతా’ అని చెప్పారు. కాగా, ఈ జాబితాలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె అగ్రస్థానంలో నిలువగా.. షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, ఆలియా భట్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు. దక్షిణాది నుంచి తమన్నా, నయనతార 16, 18వ స్థానంలో నిలిచారు.