తమిళ స్టార్ హీరో సూర్యకి గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ అందుకోవడం కష్టంగా మారింది. ఓ దశలో తన విభిన్న పాత్రల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల చేసిన ప్రాజెక్టులన్ని నిరాశపరిచాయి. ‘జై భీమ్’ తర్వాత మంచి సినిమాతో తిరిగి రావాలని ఎంతో మంది ఆశించగా, తాజాగా వచ్చిన ‘రెట్రో’ సినిమాతో మళ్లీ నిరాశే ఎదురైంది.
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ట్రైలర్ విడుదల నాటినుంచి ఆసక్తిని కలిగించినప్పటికీ, కథనం, నరేషన్ పరంగా భారీ డౌన్ అయ్యింది. పాత హిట్ల నుంచి తీసుకున్న మసాలాను మిక్స్ చేసి వడ్డించినట్టు ఉండటంతో, ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. ఇదే సమయంలో సీనియర్ నటులను చక్కగా వాడుకోలేకపోవడం కూడా ఫీల్ చేయించక మానలేదు. ఇదంతా చూస్తుంటే, సూర్య కెరీర్ మళ్లీ ఒత్తిడికి లోనవుతున్నట్టు అభిమానులకు అనిపిస్తోంది.
ఇప్పుడు ఆయన అభిమానుల ఆశలన్నీ రెండు సినిమాలపై నిలబడ్డాయి. మొదటగా ‘సూర్య 45’, ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఓ మాస్సీ కథతో వినోదాన్ని మేళవించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. కాగా, అదే సమయంలో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మరో సినిమా పైనే బలమైన పాజిటివ్ వేవ్ నడుస్తోంది. ‘లక్కీ భాస్కర్’, ‘సార్’ వంటి సినిమాలతో క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించిన వెంకీ, సూర్య కోసం ఓ వింటేజ్ డ్రామా సిద్ధం చేస్తున్నారట.
ఈ రెండు సినిమాలపై అభిమానులు గట్టి నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఒక్కటైనా బ్లాక్‌బస్టర్ అయితే సూర్య మార్కెట్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకున్న సూర్యకు ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో నిలబడేందుకు పునాదులు కావాలి. వాటిని ఈ సినిమాలు సమకూరుస్తాయో లేదో త్వరలోనే తేలనుంది.