హరీష్ శంకర్ మార్క్‌ కనిపించని సాదాసీదాగా సాగిన ‘మిస్టర్‌ బచ్చన్‌’

స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఈసారి బాక్సాఫీస్‌ పోటీలో నిలిచిన చిత్రాల్లో ‘మిస్టర్‌ బచ్చన్‌’ ఒకటి. టీజర్‌, ట్రైలర్లలో రవితేజ మార్క్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పుష్కలంగా కనిపించడం.. పాటల్లో భాగ్యశ్రీ అందచందాలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దమ్ము, ధైర్యం, నిజాయితీ కలిగిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ బచ్చన్‌ నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురు చెప్పేందుకు వెనకాడడు. అతను ఓసారి అవినీతి పరుడైన ఓ పొగాకు వ్యాపారిపై రైడ్‌ చేసి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని పట్టుకుంటాడు.

కానీ, పై అధికారులు బచ్చన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తారు. దీంతో అతను సొంతూరు కోటిపల్లికి వెళ్లి ఆర్కెస్టా ట్రూప్‌ పెట్టుకుంటాడు. అక్కడే జిక్కీ (భాగ్యశ్రీ)ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. వీళ్ల ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కిద్దామనుకుంటున్న తరుణంలో.. బచ్చన్‌కు మళ్లీ ఉద్యోగంలో చేరమని ఆదాయపన్ను శాఖ నుంచి ఫోన్‌ వస్తుంది. దీంతో ఓవైపు పెళ్లి సెట్టయినా తన డ్యూటీలో భాగంగా ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) ఇంట్లో రైడ్‌ చేయాల్సి వస్తుంది. దేశ చరిత్రలోనే ఆదాయ పన్ను శాఖ చేసిన ఓ అతి పెద్ద రైడ్‌ను ఆధారం చేసుకొని హిందీ రైడ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.

హరీష్‌ ఆ కథనే తనదైన శైలి మార్పులు.. చేర్పులతో.. రవితేజ మార్క్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి సరికొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మాతృకతో పోల్చితే ఈ చిత్ర విషయంలో హరీష్‌ చేసిన పెద్ద మార్పు.. అక్కడ లేని లవ్‌ట్రాక్‌ను ఇక్కడ జోడించడమే. అదే ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రథమార్దాన్ని నిలబెట్టడంలో.. ప్రేక్షకులకు కావాల్సినంత కాలక్షేపాన్నివ్వడంలో ఈ ట్రాకే ముఖ్య భూమిక పోషించింది. మిస్టర్‌ బచ్చన్‌ పేరు వెనకున్న కథ.. ఆ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్‌ చేసిన విధానం అలరిస్తాయి. బచ్చన్‌ సస్పెండ్‌ అయ్యి కోటిపల్లికి చేరడంతో కథ రొమాంటిక్‌ కోణంలోకి మలుపు తిరుగుతుంది. పాత హిందీ క్లాసిక్స్‌తో ముడిపెట్టి నాయకానాయికల లవ్‌ట్రాక్‌ను నడిపిన తీరు.. వాళ్ల మధ్య నడిచే క్యాసెట్స్‌ ప్రేమ రాయబారాలు అన్నీ ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోతాయి.

దీనికి తోడు మధ్యలో దొరబాబుగా సత్య చేసే అల్లరి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతుంది. సరిగ్గా విరామానికి ముందు ముత్యం జగ్గయ్య ఇంటిపై రైడ్‌కు వెళ్లడం.. ఆ తర్వాత అక్కడ బచ్చన్‌ చేసే యాక్షన్‌ హంగామా.. కథను రసవత్తరంగా మారుస్తాయి. అయితే ప్రథమార్ధంలో కనిపించిన హరీష్‌ మార్కు మ్యాజిక్‌ ద్వితీయార్ధంలో సన్నగిల్లింది.

ప్రతినాయకుడి అక్రమార్జనను తవ్వితీసే పక్రియలో హీరో బుర్రకు పదును పెట్టే సన్నివేశాలు కొన్ని అయినా ఉంటే బాగుండేది. ఆరంభంలో జగ్గయ్య పాత్రను కరుడుగట్టిన విలన్‌లా చూపించినప్పటికీ.. తన నుంచి బచ్చన్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవవు. దీంతో కథలో సంఘర్షణ తగ్గింది. మధ్యలో సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్‌ సీక్వెన్స్‌ కథకు కాస్త ఊపు తీసుకొచ్చినా, ఒక సాధారణ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది.