ఓవైపు హాస్య నటుడిగా సినీప్రియుల్ని నవ్విస్తూనే.. ‘మల్లేశం’, ‘బలగం’ వంటి విజయవంతమైన సినిమాలతో హీరోగానూ సత్తా చాటారు ప్రియదర్శి. ఇప్పుడాయన.. నభా నటేశ్‌కు జోడీగా నటించిన చిత్రమే ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే పాటలు, టీజర్, ట్రైలర్లతో అందరి దృష్టినీ ఆకర్షించింది. రాఘవ (ప్రియదర్శి) ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఆమెతో కలిసి పారిస్‌కు హనీమూన్‌కు వెళ్లాలన్నది తన చిరకాల కోరిక. ఈ క్రమంలో తండ్రి (మురళీధర్ గౌడ్) చూసిన సైకాలజిస్ట్ నందిని (అనన్య నాగళ్ల)తో కలిసి ఏడడుగులు వేయడానికి సిద్ధపడతాడు.
కానీ, ఆమె ఆఖరి నిమిషంలో ప్రేమించిన వాడితో వెళ్లిపోవడంతో.. ఆ పెళ్లి పీటలపైనే ఆగిపోతుంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన రాఘవ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతాడు. సరిగ్గా అప్పుడే ఆనంది (నభా నటేష్) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమె పరిచయమైన కొద్ది గంటల్లోనే రాఘవ ప్రపోజ్ చేయడం.. ఆ వెంటనే పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి. కాకపోతే తొలి రాత్రి రోజే ఆనంది చేతిలో చావు దెబ్బలు తింటాడు రాఘవ. దానికి ఆమె మల్టిపుల్ స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధ పడుతుండటమే కారణం. మరి దీనివల్ల రాఘవ ఎన్ని తిప్పలు పడ్డాడు. ఆనందిలో ఉన్న ఐదు పర్సనాలిటీస్ ఏంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. మల్టిపుల్ స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఆ పాయింట్‌ను సీరియస్‌గా చూపిస్తే.. దీంట్లో మాత్రం దాన్ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు.
భార్యతో కలిసి పారిస్‌కు హనీమూన్‌కు వెళ్లాలని కలలు కనే కుర్రాడి జీవితంలోకి అపరిచితురాల్లాంటి అమ్మాయి భార్యగా వస్తే ఏమైందనేది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఆరంభంలో కథను తాను అనుకున్నట్లుగా పూర్తిగా వినోదభరితంగా చూపించడంలో పైచేయి సాధించినా.. ద్వితీయార్దానికి వచ్చేసరికి కథను భావోద్వేగభరితంగా నడిపించాలో.. వినోదాత్మకంగా చూపించాలో అర్థం కాక దర్శకుడు తడబడినట్లు అనిపిస్తుంది. దీనికి తోడు కథానాయిక పాత్రలోని సంఘర్షణను ప్రభావవంతం గా తెరపైకి తీసుకురాలేకపోవడం.. ఆమెకున్న సమస్యను పోగొట్టడానికి హీరో చేసే ప్రయత్నాలు సిల్లీగా మరీ సినిమాటిక్‌గా ఉండటం చిత్ర ఫలితాన్ని దెబ్బతీశాయి.
ఈ సినిమా రాఘవ కోణం నుంచి వినోదాత్మకంగా ప్రారంభమైనా చివరికి అది కొనసాగలేదు. రాఘవ పాత్రలో ప్రియదర్శి చక్కగా ఒదిగిపోయారు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం నవ్వించే ప్రయత్నం చేశారు. దీంట్లో నభా నటేష్ ఐదు భిన్నమైన కోణాలున్న పాత్రలో కనిపించింది. ఆ పాత్రల్లోని వేరియేషన్స్‌ను తనదైన నటనతో చక్కగా చూపించింది. ఆమెకు.. దర్శికి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ బాగానే వర్కవుటయ్యాయి. కానీ, తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ అంతగా కుదర్లేదనిపిస్తురది. అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. సుహాస్, బ్రహ్మానందం, నిహారిక కొణిదెల తదితరులు అతిథి పాత్రల్లో తళుక్కుమన్నారు.