సినిమా ఫ్లాప్.. డైరెక్టర్‌కు బ్యాంకు నోటీసులు

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న దర్శకులు ఎంతో మంది ఉన్నారు. అందులోనూ కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌తో సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో ప్రేమ కథా చిత్రాల దర్శకుడు తేజ ఒకరు. చాలా కాలం నుంచి తనదైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఫలితాలను ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త సినిమాలను తీస్తూనే వస్తున్నారు.

చాలా కాలంగా భారీ విజయం కోసం వేచి చూస్తోన్న డైరెక్టర్ తేజ.. ప్రస్తుతం దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట ప్రొడక్షన్ పనులను కూడా చిత్ర యూనిట్ శరవేగంగానే పూర్తి చేసుకుంది. దీంతో ఈ క్రేజీ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

దగ్గుబాటి అభిరామ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ తీసిన ‘అహింస’ చిత్రాన్ని జూన్ 2వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఇలా తాజాగా తేజ ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. ‘సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా సినిమా హిట్ అవ్వాలనే తీస్తుంటారు. కానీ, జయాపజయాలు మన చేతుల్లో ఏమీ ఉండదు. పైగా నాకైతే కొన్ని సినిమాలు హిట్ అవుతాయా? ఫ్లాప్ అవుతాయా అన్నది తెలిసిపోతుంది. అలా తెలిసినా కూడా కొన్ని చిత్రాలు చేశాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆ తర్వాత డైరెక్టర్ తేజ కంటిన్యూ చేస్తూ.. ‘చాలా సినిమాల వల్ల గతంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఇంటి పేపర్లు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నా. కానీ, ఆ తర్వాత డబ్బులు కట్టలేకపోతే ఇంటిని జప్తు చేయబోయారు. దీంతో ఎలాగోలా ఆ డబ్బులు కట్టేశాను. ఆ తర్వాత మళ్లీ బ్యాంకులో లోన్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యా’ అంటూ తాను ఎదుర్కొన్న బాధల గురించి ఓపెన్ అయ్యారు.