పరశురాం.. అడ్వాన్స్ ల లెక్క పెద్దదే?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు అల్లు అరవింద్-దిల్ రాజు- దర్శకుడు పరశురాం పేరు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గతంలో అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరశురామ్ గీత గోవిందం మూవీ చేశాడు. అది డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయి అల్లు అరవింద్కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. పరుశురాం కెరీర్కు మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశురాంకు అడ్వాన్స్ ఇచ్చి అల్లు అరవింద్ మరో మూవీ లాక్ చేశారట. కానీ పరశురాంతో నెక్స్ట్ మూవీ దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండతో ప్రకటించడంతో అరవింద్ ఖంగుతిన్నాడు. అలా ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రకటించడం ఓ కొత్త వివాదానికి దారి తీసింది.

దీనిపై ఇప్పుడు చిత్రసీమలో పెద్ద చర్చే సాగుతోంది. అరవింద్ చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది. దిల్రాజుకు-ఆయనకు మధ్య కూడా వివాదం ముదిరేలా కొనసాగుతోంది. ఇదే విషయంలో అల్లు అరవింద్ నిన్న ప్రెస్ మీట్ కూడా ప్రకటించారు. కానీ తర్వాత ప్రొడ్యూసర్ గిల్డ్ జోక్యం చేసుకుని గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు. దీంతో అరవింద్ వెనక్కి తగ్గారు.

ఈ క్రమంలోనే తన తాజా ప్రాజెక్ట్ లో… గతంలో అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్ను భాగస్వామిని చేసి కూల్ చేయాలని, వివాదం కాకుండా చూడాలని పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇప్పుడు అవేమీ ఫలించట్లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పుడు పరశురాం గురించి మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆయన గతంలో కూడా పలు బడా బ్యానర్ల దగర్ల భారీ మొత్తంలో డబ్బులు అడ్వాన్స్గా తీసుకున్నారట. కానీ వారితో ఒక్క సినిమా కూడా చేయలేదు. నానుస్తూనే వస్తున్నారట.

గతంలో పరశురాం ఓ బ్యానర్ మూవీ చేస్తానని అగ్రీమెంట్ కుదుర్చుకుని.. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్తో సర్కారు వారి పాట ప్రకటించారు. దీంతో సదరు ప్రొడక్షన్ హౌస్ అధినేత అసహనం వ్యక్తం చేయగా.. సర్కారు వారి పాట నిర్మాణ భాగస్వామిగా ఉండేలా చేశారట. ఇప్పుడదే ఫార్ములాను విజయ్ దేవరకొండ సినిమా విషయంలో చేద్దామని అనుకున్నారట. కానీ అది వర్కౌట్ కాలేదట. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. అల్లు అరవింద్ వెనక్కి తగ్గుతారా లేదా? పరశురాం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అనేది ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.