రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆర్సీ 16 షూటింగ్ వేగంగా సాగుతోంది. ప్రీ ప్రొడక్షన్ నుంచే పక్కాగా ప్లాన్ చేసుకున్న ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు, శరవేగంగా చిత్రీకరణ జరిపి తగినంత సమయం పోస్ట్ ప్రొడక్షన్‌కు కేటాయించాలన్నది మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే క్రికెట్, కుస్తీ నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారు. వచ్చే వారంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నారని సమాచారం.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ఢిల్లీలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్లమెంట్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు అనుమతులు తీసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో ఇలాంటి అనుమతులు తేలికగా లభించేవి కానీ, టెర్రరిస్టు దాడుల అనంతరం ఆంక్షలు కఠినతరం అయ్యాయి. అయితే అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ రికమండేషన్ వల్ల అనుమతులు పొందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఢిల్లీలోని జామా మసీద్‌లోనూ కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. రంజాన్ తర్వాత దీనికి సంబంధించి అధికారిక పర్మిషన్లు తీసుకోబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా, ఢిల్లీ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందన్నది ఇంకా ఖరారు కాలేదు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అన్ని భాషలకు అనువైన పేరు కావాలనే కోణంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాపై ప్రెజర్ లేకపోలేదు. గేమ్ ఛేంజర్ నిరాశపరిచిన తర్వాత రామ్ చరణ్ మళ్లీ విజయపథంలోకి రావాలంటే ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది.
ఈ ఏడాది దసరా లేదా దీపావళికి ఆర్సీ 16ని విడుదల చేయాలన్నది మేకర్స్ లక్ష్యం. కానీ సకాలంలో షూటింగ్ పూర్తికాకపోతే, 2026 వేసవిలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. బుచ్చిబాబు దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం కలిసొచ్చేలా ఉంటే, ఈ సినిమా రామ్ చరణ్‌కి భారీ హిట్‌ను అందించొచ్చని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


